తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో ఉంది. తమ పార్టీలో ఉండే నాయకులు ఎంతమంది బయటకు వెళ్తారో తెలియక చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రజల్లో ఇప్పటికే ఆదరణ కోల్పోయిన తెలుగుదేశం పార్టీ ఆ ఆదరణను పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నిత్యం ప్రజా ఉద్యమాలు, ఆందోళనలు, ధర్నాలు ఇలా ఏదో ఒక రూపంలో తమ ఉనికిని చాటుకుంటూ పార్టీలో ఉన్న నాయకులకు భరోసా కల్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.ఈ  విషయం పక్కన పెడితే పార్టీలో ఉన్న నాయకులకు ఇప్పుడు భవిష్యత్తు మీద బెంగ ఎక్కువ అయినట్టుగా కనిపిస్తోంది. అందుకే మెల్లిమెల్లిగా పక్క చూపులు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత ఆ పార్టీని ముందుకు నడిపించే నాయకుడు ఎవరో తెలియని గందరగోళ పరిస్థితి ఉంది.


 చంద్రబాబు తన రాజకీయ వారసుడిగా  లోకేష్ కి పార్టీ పగ్గాలు భవిష్యత్తులో అప్పగించే ఛాన్స్ ఉన్నా ఆయన పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించలేడు అనే భావన ఆ పార్టీ నాయకుల్లో ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పుడే తమ రాజకీయ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకోవాలని పార్టీలోని సీనియర్, జూనియర్ నాయకులు సైతం చూస్తున్నారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. అనేక సంక్షేమ పథకాలు, నిర్ణయాలతో ప్రభుత్వం దూసుకుపోతోంది. అన్ని వర్గాల ప్రజల ఆదరణ ఆ పార్టీకి పెరుగుతోంది. ఈ క్రమంలోనే చాలామంది నాయకులు అధికార పార్టీ వైసీపీ వైపు చూస్తున్నారు. అయితే వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం ఉండడంతో వాటి ఫలితాలు వచ్చిన తర్వాత ఆయా పార్టీల బలాలను పరిశీలించి అప్పుడు నిర్ణయం తీసుకోవాలని నాయకులు చూస్తున్నారు.


 ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు పార్టీ మారే ఆలోచనలో ఉండగా, ప్రస్తుతం ఎమ్మెల్సీలు కూడా వైసీపీలోకి జంప్ చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీ కంటే టిడిపికి ఎక్కువ బలం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మండలి వ్యతిరేకిస్తూ ఉండడంతో ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. దీంతో అసలు మండలిని రద్దు చేస్తే తమకు అడ్డు ఉండదు అన్నట్టుగా జగన్ ఆలోచిస్తున్నారు. అయితే మండలిలో వైసీపీ కీలక నాయకులు ఉండడం,ఎమ్మెల్సీ ద్వారానే ఇద్దరికి తన కేబినెట్లో చోటు ఇవ్వడంతో జగన్ ఆలోచనలో పడ్డారు. 


అందుకే మండలిని రద్దు చేసేకంటే టిడిపి మండలి సభ్యులను వైసీపీలోకి తీసుకువచ్చేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు. వారిని నేరుగా పార్టీలోకి తీసుకోకుండా ముందుగా రాజీనామా చేయించి మళ్లీ వాళ్ళకే తమ పార్టీ ద్వారా ఎమ్మెల్సీ అవకాశం వచ్చేలా చేయాలని అని జగన్ ఆలోచనగా తెలుస్తోంది.  అదే గనుక జరిగితే టిడిపి చిక్కుల్లో పడే అవకాశం ఉంది. నాయకులంతా ఒక్కొక్కరుగా వైసిపి గూటికి చేరితే క్షేత్రస్థాయిలో పార్టీ బలహీనం అవ్వడంతో పాటు ద్వితీయశ్రేణి నాయకులు సైతం పార్టీని వీడే అవకాశం ఉంటుందని జగన్ ఆలోచనగా తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: