మూడు రాజధానుల ప్రతిపాదన నేపధ్యంలో  తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత రెహమాన్ పార్టీకి రాజీనామా చేశారు. విశాఖపట్నం అర్బన్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంఎల్ఏ  అబ్దుల్ రహ్మన్  పార్టీతో పాటు పదవికి కూడా రాజీనామా చేశారు.  విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనను చంద్రబాబునాయుడు తో పాటు కొందరు నేతలు వ్యతిరేకించటాన్ని  రహ్మాన్ తీవ్రంగా నిరసించారు.

 

అధికారంలో ఉన్న ఐదేళ్ళ కాలంలో అమరావతిలో రాజధానిని నిర్మించలేకపోయిన చంద్రబాబు ఘోరంగా ఫెయిల్ అయినట్లు మండిపడ్డారు. తాను రాజధానిని నిర్మించలేకపోయినా విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకుందామన్న జగన్ ప్రతిపాదనను వ్యతిరేకించటమేంటి ? అంటూ చంద్రబాబును నిలదీశారు.

 

మొత్తానికి పార్టీతో దశాబ్దాల అనుబంధమున్న  రహ్మాన్ రాజీనామా చేయటం చంద్రబాబుకు షాకనే చెప్పాలి. అదికూడా మూడు రాజధానుల ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకిస్తున్న విషయంపైనే రాజీనామా చేయటం మరింత దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు వైఖరికి నిరసనగా ఉత్తరాంధ్రలోని చాలా మంది నేతలు మండిపోతున్నారు.

 

 రాజధానిగా అమరావతినే కంటిన్యు చేయాలని డిమాండ్ చేస్తు జిల్లాల పార్టీ కమిటిలను తీర్మానాలు చేసి పంపమని చంద్రబాబు ఆదేశిస్తే నేతలు లెక్క చేయలేదు. పైగా శ్రీకాకుళం, విశాఖపట్నం అర్బన్ , రూరల్ జిల్లాల పార్టీ నేతలు జగన్ ప్రతిపాదనకు మద్దతుగా తీర్మానాలు చేయటాన్ని  చంద్రబాబు ఊహించలేదు. టిడిపి నేతల సమావేశాల్లో జగన్ కు మద్దతు తెలుపుతూ తీర్మానాలంటే మామూలు షాక్ కాదు.

 

ఈ షాకులు ఇలా ఉండగానే రహ్మాన్ రాజీనామా చేయటం ఊహించని దెబ్బే. రెహ్మాన్ రాజీనామాను మరింత మంది నేతలు గనుక అనుసరిస్తే  మొత్తం ఉత్తరాంధ్రలో పార్టీ ఖాళీ అయిపోవటం ఖాయమనే టెన్షన్ పెరిగిపోతోంది చంద్రబాబులో.  ఇప్పటికే జగన్ నిర్ణయానికి మద్దతుగా విశాఖపట్నం నగరంలో గెలిచిన నలుగురు ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంఎల్సీలు, రెండు జిల్లాల అధ్యక్షులు, మాజీ ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. మరి రహ్మాన్ దారిలో ఇంకెంతమంది రాజీనామాలు చేస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: