హైకోర్టు తరలింపు అంశం .. సీమ, కోస్తాంధ్ర మధ్య వివాదంగా మారుతోందా? హైకోర్టు ఇస్తారా.. ప్రత్యేక రాష్ట్రం ఇస్తారా అని సీమ న్యాయవాదులు కోరుతున్నారా..? దీనికి కోస్తాంధ్ర లాయర్లు ఏమంటున్నారు? ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటోందా... హైకోర్టు తరలింపులో ఏం జరుగుతుందో తెలుసా..!

 

రాయలసీమ ఎప్పుడు త్యాగాలతోనే బతకాలా.?. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కోసం రాజధానిని కోల్పోయాం. అభివృద్ధికి దూరమయ్యాం. ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వం చెప్పినట్లుగా హైకోర్టును కర్నూలుకు తరలించాలి.  లేకుంటే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే.. మా బతుకు మేం చూసుకుంటాం. ఇదీ సీమ న్యాయవాదుల  డిమాండ్. సీమప్రజలు మంచితనానికి మారుపేరని.. అందరి బాగు కోరుకుంటారని న్యాయవాదులు చెప్పారు. అలా అని.. మా బతుకులు ఎప్పుడు దిగువస్థాయిలోనే ఉంటే ఎలా అని ప్రశ్నించారు. హైకోర్టులో డిసెంబర్ 24న చేసిన తీర్మానంతో తమకు సంబంధం లేదన్నారు.

 


మరోవైపు హైకోర్టు కర్నూలుకు తరలించడానికి తాము అంగీకరించమంటున్నారు కోస్తాంధ్ర న్యాయవాదులు. విభజన హామీలను అనుసరించి అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేశారని... బొమ్మలు మార్చినట్లు మార్చడానికి వీల్లేదని ఇక్కడి న్యాయవాదులు చెబుతున్నారు. అసలు రాజధాని తరలింపు నిర్ణయమే .. సరికాదంటున్నారు బెజవాడలోని లాయర్లు. ప్రభుత్వం ఇష్టానుసారం మొండిగా ముందుకెళ్తే.. న్యాయపరంగా ఎదుర్కొంటామని చెబుతున్నారు ఇక్కడి లాయర్లు. దాదాపు 60 నుంచి 65  శాతం కేసుల్లో ప్రభుత్వం ఓ పార్టీగా ఉందని.. తిరగడానికే కోట్ల రూపాయలు వ్యయమవుతాయంటున్నారు ఇక్కడి న్యాయవాదులు. ఈ విషయంపై రేపు విధులు బహిష్కరించి, నిరసన తెలియజేస్తామన్నారు. కావాలంటే బ్రాంచ్‌లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.

 

రాష్ట్రానికి వ్యూహాత్మక ప్రదేశంలో అమరావతి ఉన్నందున.. కేపిటల్, హైకోర్టు .. రెండూ ఇక్కడే ఉండాలని ఇక్కడి న్యాయవాదులు కోరుతున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం.. ఇక్కడ ఉండడమే సరైన విధానమన్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. మొత్తానికి సీమాంధ్ర లాయర్ల మధ్య హైకోర్టు అంశం అగ్గి రాజేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: