దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఎల్గార్ పరిషత్-మావోయిస్టు లింకుల కేసులో విరసం (విప్లవ రచయితల సంఘం) నేత వరవరరావు అరెస్టయిన విషయం తెలిసినదే. అయితే ఆగష్టు 2018 లో వరవరరావు ఇంట్లో రైడ్ చేసిన పోలీసులు ఒక ద్వంసమైన హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇప్పటివరకు ఆ డిస్క్ నుంచి మాత్రం డేటాను రాబట్టలేక పోయారు మన అధికారులు. దాంతో అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థ ఎఫ్‌బిఐ సహాయం తీసుకోవాలని పూణే పోలీసులు నిర్ణహించుకున్నట్లు గురువారం రోజు ఒక అధికారి తెలిపారు.


హార్డ్ డిస్క్ ఇంతకుముందు నాలుగు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలకు పంపించారు. కానీ ఏ ఒక్క ల్యాబొరేటరీలోనూ అధికారులు హార్డ్ డిస్క్ నుంచి డేటాను సేకరించలేకపోయారు. దీనిని మొదట పూణేకు చెందిన ల్యాబొరేటరీలకు పంపారు. అక్కడ నిపుణులు డేటాను రాబట్టడానికి ప్రయత్నించారు కానీ విఫలం అయ్యారు. ఆపై ఈ హార్డ్ డిస్క్ ను ముంబైకి చెందిన డైరెక్టరేట్ అఫ్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్ కు పంపించారు. కాని అక్కడి వారు కూడా డేటాను రాబట్టలేకపోయారు. అయితే, ఇలా ద్వంసమైన హార్డ్ డిస్క్ ల నుండి సమాచారాన్ని రాబట్టే ఉన్నతస్థాయి టెక్నాలజీ అమెరికాకు చెందిన ఎఫ్.బి.ఐకు ఉంది. సో, పూణే పోలీసులు అమెరికా సహాయం తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. దీనికి కేంద్ర సర్కార్ కూడా పచ్చ జెండా ఊపడంతో.. పూణే పోలీసులు త్వరలోనే అమెరికాకి వెళ్లనున్నారు.


పూణే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 2017 డిసెంబర్ 31 న పూణేలో జరిగిన ఎల్గర్ పరిషత్ సమ్మేళనంకు మావోయిస్టులు మద్దతు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేసిన కొన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు మరుసటి రోజు భీమా కోరెగావ్ మెమెరియల్ వద్ద హింసాత్మక ఘటనలకు దారితీశాయి. ఎల్గర్ పరిషత్-కోరెగావ్ భీమా కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఒక లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని "హత్య" చేయాలన్న కుట్ర, ఇంకా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్రలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఆ లేఖలో వరవరరావు పేరు కూడా ఉండటంతో ఆయన్ని అరెస్ట్ చేసారు పోలీసులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: