తెలంగాణ వాసులకు కేంద్రం త్వరలోనే శుభవార్త అందించేలా కనిపిస్తోంది. రాష్ట్రానికి భవిష్యత్తులో కొత్తగా ఆరు ఎయిర్‌పోర్టులు రానున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్రం ఆదేశాలతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ కొత్తగా ఆరు విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలంగాణలో కేవలం వాణిజ్యపరంగా రాజీవ్ గాంధీ విమానాశ్రయం తప్పితే.. వేరే చోట ఎక్కడా కూడా అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ లేదు. బేగంపేట్‌లో ఒక విమానాశ్రయం ఉన్నా.. అది కమర్షియల్ విమానాలకు అనుమతి లేదు.

 

దీంతో అందరూ కూడా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్‌నే ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా ఇరు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావడంతో ఈ ఎయిర్‌పోర్టును 10 సంవత్సరాల పాటు పంచుకోనున్నాయి. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆరు వాణిజ్య విమానాశ్రయాలు ఉన్నాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కడప, ఓర్వకల్, రాజమండ్రి.. ఇలా ఆరు ఎయిర్‌పోర్టులు ఏపీకి అందుబాటులో ఉండగా.. వీటిల్లో మొదటి మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు.

 

ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖకు ప్రతిపాదనలు చేసింది ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపాదించిన 6 విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు ఏరియల్ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ). తెలంగాణలో ఆరు ప్రాంతాలను గుర్తించగా.. ఆ ప్రదేశాల్లో సాధ్యాసాధ్యాలపై సర్వే చేస్తుంది ఏఏఐ. నిజామాబాద్‌, మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఎయిర్ పోర్ట్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

 

నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అద్దకల్‌, భద్రాద్రి కొత్తగూడెం వద్ద, వరంగల్‌ జిల్లా మామునూరు, ఆదిలాబాద్‌ నగర శివారు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌ ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని ప్రభుత్వం భావించి ప్రతిపాదనలు ఏఏఐకి పంపింది. ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు, రన్‌వేలు, ఏటీసీకి అనుకూలతలు, వాతావరణ అంశాల లాంటివి పరిగణలోకి తీసుకోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: