భారత ఆర్మీలో మిగ్‌ యుద్ధ విమానాల శకం ముగిసింది. నాలుగు దశాబ్దాలకు పైగా ఈ తురుపు ముక్క సేవలందించింది. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించిందీ ఫైటర్ జెట్‌. కార్గిల్‌ వార్‌లో పాక్‌ సేనల్ని తరిమికొట్టిన ఈ యుద్ధ విమానానికి వాయుసేన ఘనంగా వీడ్కోలు పలికింది.

 

కార్గిల్ వార్‌లో కీలకంగా వ్యవహరించిన మిగ్ 27 యుద్ధ విమానాలు .. ఇక చరిత్రే.  నాలుగు దశాబ్దాల పాటు సేవలందించిన మిగ్ 27కు వాయుసేన వీడ్కోలు పలికింది. జోధ్ పూర్ వైమానిక స్థావరం నుంచి మిగ్ 27లు చివరిసారిగా ఆకాశంలో చక్కర్లు కొట్టాయి. వైమానిక దళంలోనే పవర్ ఫుల్ యుద్ధవిమానంగా పేరు గాంచిన మిగ్ 27... 1999నాటి కార్గిల్ యుద్ధం..  ఆపరేషన్ సేఫ్‌డ్‌ సాగర్‌లో ప్రముఖ పాత్ర పోషించాయి. మిగ్ 27 విమానాలకు వీడ్కోలు పలికే కార్యక్రమానికి ఎయిర్ చీఫ్‌ మార్షల్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు.

 

మిగ్ 27 యుద్ధ విమానాలను దశలవారిగా వైమానిక దళం నుంచి తొలగిస్తున్నారు. గతేడాది జోధ్‌పూర్ వైమానిక స్థావరం నుంచి, మూడేళ్ల కిందట పశ్చిమ బెంగాల్‌లోని హసీమారాలో వీడ్కోలు పలికారు. ఈ విమానాలను 1981లో సోవియట్ యూనియన్ నుంచి కొనుగోలు చేశారు. గాల్లోంచి భూమిపైన లక్ష్యాలను గురిపెట్టే ఈ విమానాలు 38 ఏళ్లపాటు విశిష్ట సేవలు అందించాయి. 

 

రష్యా నుంచి కొనుగోలు చేసిన మిగ్ యుద్ధ విమానాలు.. తరచూ ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఇప్పటికే చాలా విమానాలు కుప్పకూలాయి. వీటి పనితీరుపై విమర్శలు రావడం.. శత్రు దేశాలు పవర్ ఫుల్‌ జెట్‌లను వినియోగిస్తుండటంతో భారత వాయుసేన వీటికి స్వస్థి చెప్పాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఏ దేశంలోనూ ఇవి వినియోగంలో లేవు.  ఇకపై తేజస్‌, ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్‌ జెట్‌ విమానాలు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు  కొత్త శక్తి ఇవ్వబోతున్నాయి.  మొత్తానికి  కార్గిల్‌ వార్‌లో పాక్‌ సేనల్ని తరిమికొట్టిన ఈ యుద్ధ విమానానికి వాయుసేన ఘనంగా వీడ్కోలు పలికింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: