టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌య‌మై తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ‌ రాష్ట్ర మంత్రి  శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.  ప్రపంచం అంతా తెలంగాణ వైపు చూస్తుంటే.. తెలంగాణ సమాజం కేసీఆర్‌ వైపు, యువత అంతా కేటీఆర్‌ వైపు చూస్తుంద‌న్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అని అన్నారు. మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌కు దారితీశాయి.


వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అఖండ విజయం సాధిస్తుంది అని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ధీమా వ్య‌క్తం చేశారు. దేశం కేసీఆర్ వైపు..యువత కేటీఆర్ వైపు చూస్తుందన్నారు. కేటీఆర్ సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతుందన్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ ప్రజాధరణ ఉన్న నేత అని అన్నారు. ప్రజల గురించి విజన్ ఉన్న నేత కేటీఆర్ అని అన్నారు. కేంద్రం ఏం ఇవ్వకున్నా కేసీఆర్, కెటిఆర్ లు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అన్నారు. సీఏఏ, ఎన్నార్సీ బిల్లు తర్వాత దేశంలోని పలు రాష్ర్టాల్లో గందరగోళం నెలకొందని కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం ప్రశాంతంగా ఉందని తెలిపారు. `సొంత కుటుంబాన్ని గెలిపించుకునే సత్తా లేని ఉత్తమ్ తమ నాయకుని గురించి మాట్లాడుతారా?` అని ప్రశ్నించారు

రెచ్చగొట్టడం,కులమతాల మద్య చిచ్చు పెట్టడం ప్రతిపక్షాలకు స‌హ‌జమైన అంశంగా మారింద‌న్నారు. సెంటిమెంట్ ని రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోందన్నారు. అభివృద్ది చేయాలి అనుకుంటే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ``బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు దేశాన్ని ఎలా రక్షించాలని ఆలోచించడం లేదు. దేశంలో లౌకికత్వాన్ని పాటించే పార్టీ టీఆర్‌ఎస్‌ మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్‌లో ఎప్పుడు కర్ఫ్యూ ఉంటుందో ఎవరికి తెలియకపోతుండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అన్ని మతాల, కులాల పండుగలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉండడం బీజేపీ చూడలేకపోతుంది. హుజుర్‌నగర్‌లో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్కించుకోవాలి. సమ్మక్క - సారక్క జాతరను జాతీయ పండుగగా గుర్తించేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదు? సమ్మక్క - సారక్క జాతరను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తుంది.` అని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: