ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఇచ్చిన హామీకి పూర్తి చ‌ట్ట‌బ‌ద్ద‌త ద‌క్కింది. ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ చేసిన చట్టానికి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. శాసనసభలో ఆమోదం పొందిన ఏపీ ఆర్టీసీ చట్టం-2019 ప్రకారం ఉద్యోగుల విలీనానికి అంగీకారం తెలిపారు. విలీనానికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేయనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గవర్నర్‌ పేరిట ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో 52 వేలమంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించ‌బ‌డుతారు.

 


 ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ‘ఏపీ ఆర్టీసీ చట్టం-2019’ బిల్లును శాసనసభ ఇటీవల ఆమోదించింది. ప్రభుత్వం తీసుకువచ్చే ఏపీఎస్‌ ఆర్టీసీ విలీనం చట్టం ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉన్న ఆర్టీసీ పూర్తిగా ప్రభుత్వ సంస్థగా అవతరించనుంది. ఇక ఆర్టీసీ విలీనానికి సంబంధించి  ప్రభుత్వం గెజిట్‌ నొటిఫికేషన్‌ను జారీ చేయనుంది.

 

కాగా, ఇటీవ‌లి స‌మావేశాల్లో ఆర్టీసీ విలీనం బిల్లును మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. జనవరి 1లోపు ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కొత్త చట్టం తెచ్చామన్నారు. 1997లో చంద్రబాబు నాయుడు తెచ్చిన చట్టం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో కలిపేందుకు అడ్డంకిగా మారిందని, అందుకే కొత్త చట్టం తెచ్చామని మంత్రి వివరించారు. విలీనానికి బోర్డు కూడా అంగీకారం తెలిపిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి కొత్తగా ప్రజారవాణా విభాగం ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. కార్మికుల ఉద్యోగభద్రత కోసమే ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని మంత్రి నాని పేర్కొన్నారు. మాట ప్రకారం జ‌న‌వ‌రి 1లోపు విలీనం పూర్తి చేసింది జ‌గ‌న్ స‌ర్కారు.

మరింత సమాచారం తెలుసుకోండి: