జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనపై ఢిల్లీలోని బిజెపి పెద్దలు హఠాత్తుగా యూటర్న్ తీసుకున్నారు.  ముందేమో జగన్ ప్రతిపాదనకు బిజెపి నేతలు పూర్తిస్ధాయిలో మద్దతు ప్రకటించారు.  రాజధానుల ఏర్పాటు అంశంపై జగన్ ప్రతిపాదనకు బిజెపి నేతల మద్దతు వచ్చేసింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదని అందరూ అనుకున్నారు. చంద్రబాబునాయుడు, పవన్, వామపక్షాలు ఎంతగా వ్యతిరేకించినా ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకున్నారు.

 

కానీ నాలుగు రోజులు పోయేసరికి బిజెపిలో మార్పులు స్పష్టంగా కనబడింది. జగన్ ప్రతిపాదనను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నుండి చాలామంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  ఇంత హఠాత్తుగా బిజెపి నేతలు ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సొచ్చింది ? ఎందుకంటే  ఒకటి రాష్ట్రానికి చెందిన బిజెపి నేతల్లో సుజనా చౌదరి లాంటి వాళ్ళు బిజెపి అధిష్టానంతో రాసుకుపూసుకు తిరుగుతున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలించబోతున్నట్లు తెలియగానే  బిజెపిలోని చంద్రబాబు సామాజికవర్గం నేతలంతా ఏకమైనట్లు అనుమానంగా ఉంది. జగన్ గనుక అన్నంత పనీ చేస్తే వేలకోట్ల రూపాయలు ఆర్ధికంగా దెబ్బ పడటం ఖాయం. అందుకనే ఇన్ సైడర్ ట్రేడింగ్, రియల్ ఏస్టేట్ లాంటి వ్యవహారాలను ప్రస్తావించకుండా సెంటిమెంటు అస్త్రాన్ని బయటకు తీశారు. అదేమిటంటే ఉద్ధండరాయునిపాలెం గ్రామంలో రాజధానికి నరేంద్రమోడి శంకుస్ధాపన చేశారు.

 

స్వయంగా మోడి శంకుస్ధాపన చేసిన రాజధానినే తరలించేందుకు జగన్ ప్రయత్నించటం అంటే ప్రధానిని అవమానపరచటమే అంటూ ఒకటే ఊదరగొట్టారు. వాళ్ళ సెంటిమెంటు ఆయిట్మెంట్ బిజెపి పెద్దల మీద పనిచేస్తున్నట్లే అనిపిస్తోంది. దాంతో  వాళ్ళు కూడా జగన్ ప్రతిపాదనపై మండిపడ్డారట. అందుకనే జగన్ ప్రతిపాదనను వ్యతిరేకించాలని ఢిల్లీ నుండి ఆదేశాలు అందాయి.

 

ఢిల్లీలో పరిణామాలను గమనిస్తున్న ఒరిజినల్ బిజెపి నేతలు జగన్ విషయంలో మారిన తమ నాయకత్వ వైఖరిని చూసి ఆశ్చర్యపోయారు. అయితే పెద్దల వైఖరిని ప్రభావితం చేయగలిగిన స్ధితిలో లేరు కాబట్టి మాట్లాడకుండా కూర్చున్నారు. సరే ఎవరి స్టాండ్ ఎలాగున్నా రాజధాని మార్పు అన్నది పూర్తిగా రాష్ట్రప్రభుత్వం పరిధిలోని అంశం. కాబట్టి ఢిల్లీలో ఎవరేమనుకున్నా వాళ్ళని జగన్ లెక్క చేస్తారని ఎవరూ అనుకోవటం లేదు.  మరి చూద్దాం జనవరిలో ఏం జరుగుతుందో ?

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: