అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సబ్‌ కమిటీ రిపోర్ట్‌.. కేబినెట్‌లో చర్చ తర్వాత ఈ అంశంపై సమగ్ర విచారణకు ప్రభుత్వం సిద్ధంకానుండటంతో సవాళ్ల పర్వం తెరపైకి వస్తోంది.  వైజాగ్‌లో ఈ ఆరు నెలల కాలంలో జరిగిన లావాదేవీల సంగతి ఏమిటని ప్రశ్నిస్తోంది టీడీపీ. 

 

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో టీడీపీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం  అవినీతిని తవ్వలేదని... సర్కార్‌ను పూడ్చిపెట్టే గొయ్యిని తవ్విందని  నారా లోకేష్‌ ట్విట్టర్ లో తీవ్ర విమర్శలు చేశారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై కాకి లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. మరోవైపు-నారా లోకేష్‌కు బినామీ అంటూ మంత్రివర్గ ఉపసంఘం పేర్కొనడంపై అభ్యంతరం తెలిపారు ఏపీ ఎన్ ఆర్ టి మాజీ అధ్యక్షుడు వేమూరు రవి. 2005లో కొనుగోలు చేసిన భూములను ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌గా చెబుతున్నారని ఆయన అన్నారు. రాజధాని ప్రకటనకు ముందు ఒక్క ఎకరం కొన్నా.. ఆ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేస్తానని తెలిపారు రవి. తాను కొన్న భూములు అక్రమ లావాదేవీలైతే ఏ సంస్థతో అయినా విచారణ జరిపించుకోవచ్చునని సవాల్‌ చేశారు.

 

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఏ విచారణకైనా సిద్ధమంటూనే..విశాఖలో జరిగింది ఏమిటని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నాయకులు. గత ఆరు నెలల కాలంలో విశాఖలో 20 వేల ఎకరాలకు పైగా లావాదేవీలు  జరిగాయనేది  తెలుగుదేశం నేతల ఆరోపణ. వీటిని వైసీపీ నేతలే కొన్నారని  వారు చెబుతున్నారు.  రాజధానిని విశాఖకు తరలించడానికి వెనుక ఉన్న కారణం ఇదేనని ఆరోపిస్తున్నారు టీడీపీ నాయకులు. వైజాగ్‌లో ఈ ఆరు నెలల కాలంలో జరిగిన భూ లావాదేవీలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.


త్రీ క్యాపిటల్స్‌ విషయంలో బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ ఇచ్చే నివేదికపై  అభ్యంతరం వ్యక్తం చేస్తోంది టీడీపీ. చాలా దేశాల్లో బీసీజీపై విచారణలు జరుగుతున్నాయని.. అలాంటి సంస్థ అందజేనే రిపోర్ట్‌ ఆధారంగా క్యాపిటల్‌ను ఎలా మారుస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బోస్టన్ కన్సల్టెన్సీ ఏర్పాటు పైనా టీడీపీ అభ్యంతరం చెబుతోంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ పలు దేశాల్లో విచారణలు ఎదుర్కొందని....అలాంటి కమిటీ నివేదిక ఆధారంగా రాజధాని మార్పు ఎలా చేస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బోస్టన్ కంపెనీలో విజయసాయి రెడ్డి చెందిన వ్యక్తులు పని చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇటు అమారవతి, అటు విశాఖలో భూముల పై రెండు పార్టీలు విచారణలకు డిమాండ్ చేస్తున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: