ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను జగన్ ప్రకటించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తి జగన్ నిర్ణయానికి కొంతమంది నాయకులు జై కొట్టి ఇబ్బందికరంగా మారారు. తాజాగా విశాఖలో జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉండడంతో పాటు వైసిపి క్రేజ్ అమాంతం పెరగడం, అదే సమయంలో తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో ప్రజా వ్యతిరేకత కనిపిస్తుండటంతో విశాఖ తెలుగుదేశం నాయకులు చాలామంది వైసీపీలోకి జంప్ చేయాలని చూస్తున్నారు. 


తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి విశాఖ తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాగా మారింది. బీసీ జనాభా ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో టీడీపీకి వారంతా వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ గ్రామీణలో 11 నియోజకవర్గాలు ఉండగా ఒక్క సీటును కూడా ఆ పార్టీ గెలుచుకో లేకపోవడం ఇప్పుడు నాయకులను ఆలోచనలో పడేస్తోంది. అయితే అర్బన్ ప్రాంతాల్లో మాత్రం విశాఖ వెస్ట్, ఈస్ట్, సౌత్, నార్త్ స్థానాలను టిడిపి గెలుచుకో గలిగింది. పట్టణ ప్రాంతంలో టీడీపీకి గట్టిపట్టు ఉన్నట్టుగా అర్థం కావడంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందని ఆ పార్టీ భావించింది. కానీ గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్, గణబాబు ఇప్పుడు టిడిపి కి దూరంగా ను వైసీపీ కి దగ్గరగా మెలుగుతున్నారు అనే వార్తలు జోరందుకున్నాయి. 


వీరంతా ఎప్పటి నుంచో పార్టీలో చేరాలని చూస్తున్నా వీరికి సరైన అవకాశం లభించలేదు. కానీ జగన్ విశాఖను ఎగ్జికుటివ్ క్యాపిటల్ గా ప్రకటించగానే వీరిలో కొత్త ఆశలు రేకెత్తాయి. పార్టీ మారేందుకు ఇదే సరైన సమయంగా వీరంతా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే జగన్ రాజధాని ప్రకటన చేయగానే ఆయన నిర్ణయానికి మద్దతు ప్రకటించారు/ అలాగే వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేయాలని స్వయంగా చంద్రబాబు వీరికి ఫోన్లు, టెలి కాన్ఫరెన్స్ ద్వారా సందేశాలు పంపుతున్నా వీరు మాత్రం తమకు ఎందుకు వచ్చింది లే అన్నట్టుగా మౌనంగా ఉండి పోతున్నారు. 

 

ఇసుక కొరత, ఉల్లి ధరలు, ఆర్టీసీ చార్జీల పెంపు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం వంటి వాటిపై టిడిపి పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని పిలుపునిచ్చినా, ఒక్క విశాఖ తూర్పు నియోజకవర్గం మినహా మిగతా నియోజకవర్గాల్లో నాయకులు స్పందించలేదు. గత కొంత కాలంగా గంటా శ్రీనివాసరావు వైసీపీ లో చేరతారని వార్తలు బలంగా వస్తున్నాయి. మధ్యలో ఆయన బిజెపి వైపు చూస్తున్నారనే అనుమానాలు కలిగినా ఆయన దృష్టి మొత్తం వైసీపీ వైపు ఉంది. ఇప్పుడు ఈ నలుగురు టిడిపి నాయకులు వైసీపీలో చేరేందుకు సిద్దమయినట్టుగా తెలుస్తోంది. అదే కనుక జరిగితే విశాఖ జిల్లాలో టిడిపి బాగా బలహీన పడే అవకాశం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: