గోదావరి జిల్లాల ప్రజలు ఎటు ఉంటే అటు అధికారం వస్తుందనే సంప్రదాయాన్ని రాజకీయ పార్టీలు చాలా కాలం నుంచి బలంగా నమ్ముతూ వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే గోదావరి జిల్లాల్లో ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీలే అధికార పీఠాన్ని దక్కించుకుంటూ వస్తున్నాయి. అందుకే రాజకీయ పార్టీలు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. ఏ పథకమైనా ముందుగా గోదావరి జిల్లాలోనే ప్రారంభిస్తూ తాము ఈ జిల్లాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో చాటి చెప్పుకుంటూ ఉంటాయి. తాజాగా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా జగన్ నిర్ణయించడంతో దీనిపై గోదావరి జిల్లాల్లో స్పందన ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ప్రభుత్వం కూడా ఆరా తీస్తోంది. ప్రభుత్వం అనుకున్నట్టుగానే జగన్ నిర్ణయంపై గోదావరి జిల్లాల్లో సానుకూల స్పందన కనిపిస్తోంది. 


ఎందుకంటే విశాఖలో ఎక్కువగా గోదావరి జిల్లాలకు చెందిన వారే పెద్ద ఎత్తున స్థిరపడ్డారు. అక్కడ పెద్ద ఎత్తున ఈ జిల్లాలకు చెందిన వారు వ్యాపారాలు,  పరిశ్రమలు అనేకం ఏర్పాటు చేశారు. వాటిల్లో ఉపాధి పొందే నిమిత్తం ఈ జిల్లాలకు చెందిన వారే ఎక్కువగా ఉండడంతో జగన్ నిర్ణయానికి పూర్తిగా జిల్లాల నుంచి మద్దతు లభిస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి విశాఖ పెద్ద దూరం కాదు కాబట్టి విశాఖలోనే రాజధానిని ఏర్పాటు చేసేందుకు వీరంతా మద్దతు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడి విద్యావంతుల ఎక్కువమంది ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో చదువు కోవడం, ఉద్యోగాలు పొందడం ఇవన్నీ విశాఖ వైపు మొగ్గు చూపేందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే వైసిపి ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా కాలంగా ఇక్కడ మకాం వేసి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. 


జగన్ ప్రకటనకు ముందే విజయ సాయి రెడ్డి విశాఖలో మేధావులు కొంతమంది విశాఖను రాజధానిగా చేస్తే ఎలా ఉంటుంది అనే విషయం పై అభిప్రాయాలు కూడా సేకరించారు. విశాఖను రాజధానిగా ప్రకటిస్తే కృష్ణ గుంటూరు జిల్లాల తప్ప మిగతా జిల్లాల్లో సానుకూల స్పందన ఉంటుందని ఒక అభిప్రాయానికి వచ్చిన జగన్ ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే ఆంధ్ర యూనివర్సిటీ లోని కొన్నిబ్లాకులను సెక్రటేరియట్ నిమిత్తం పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు గోదావరి జిల్లాలో కూడా విశాఖను రాజధానిగా పూర్తిస్థాయిలో సమర్థిస్తుండడంతో జగన్ కూడా ఆనందంలో ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: