మూడు రాజధానుల అంశం ఏపీని కుదిపేస్తోంది. వైసీపీ మినహా మిగతా ఏ పార్టీలు దీనిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. తెలుగుదేశం పార్టీలో ఈ అంశంపై ప్రాంతాల వారీగా నాయకులు తమ వాదనను వినిపిస్తున్నారు. విశాఖ, రాయలసీమ జిల్లాల నేతలు జగన్ తీసుకున్న నిర్ణయానికి జై కొడుతున్నారు. అదే సమయంలో అమరావతి ప్రాంత తెలుగుదేశం నాయకులు పార్టీ నిర్ణయానికి కట్టుబడి అమరావతిలోని రాజధానిని కొనసాగించాలి అంటూ పెద్ద ఎత్తున రైతులతో కలిసి డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అక్కడికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లకపోవడం మిగతా ప్రాంతాల్లో వ్యతిరేకత వస్తుందని ముందుగా ఊహించడమే కారణం. ఇక జనసేన విషయానికి వస్తే మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నుంచి ఇప్పుడు వరకు స్పష్టమైన ప్రకటన రాలేదు. అమరావతి ప్రాంతంలో రైతులు చేస్తున్న దీక్షకు ఆ పార్టీ నాయకులు నాగబాబు, నాదెండ్ల మనోహర్ మాత్రమే వెళ్లి సంఘీభావం తెలిపారు. కానీ మిగతా ప్రాంతాల్లో జనసేన పార్టీ ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఏ విధంగా ప్రకటన చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఈ రోజు జనసేన విస్తృతస్థాయి విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.


 ఈ సందర్భంగా ఈ విషయాలపై పూర్తి స్థాయిలో చర్చించి ప్రకటన చేయాలని జనసేన భావిస్తోంది. ఇప్పటికే పవన్ అన్న చిరంజీవి జగన్ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా లేఖ రాయడంతో దానిపై ఏ విధంగా స్పందించాలో తెలియని పరిస్థితుల్లో పవన్ ఉండిపోయాడు. ఆ తరువాత క్రిస్టమస్ ను పురస్కరించుకుని పవన్ అత్తగారింటికి విదేశాలకు వెళ్ళిపోవడంతో దీనిపై క్లారిటీ రాలేదు. ఈరోజు జనసేన విస్తృతస్థాయి సమావేశానికి పవన్ వస్తుండడంతో దీనిపై ఏం చేయబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రాయలసీమలో హైకోర్టు, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడంపై మొదట్లో ఉన్నంత సానుకూల దృక్పథం ఇప్పుడు లేదని జనసేన భావిస్తోంది. అందుకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నే పవన్ ప్రత్యక్ష పోరాటానికి దిగాలని ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది.


 ముందుగా రాజధాని ప్రాంత రైతుల దీక్షకు సంఘీభావం తెలిపి రైతులతో కలిసి పోరాటం చేయాలని భావిస్తున్నట్టు జనసేన నుంచి వస్తున్న సమాచారం. ఒకవేళ ఆ సందర్భంగా ప్రభుత్వం తనను అరెస్టు చేస్తే రాజకీయంగా జనసేన కు మరింత మైలేజ్ వస్తుందని పవన్ భావిస్తున్నారట. ఇవే విషయాలపై పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ రోజు చర్చించే అవకాశం కనిపిస్తోంది. మంగళగిరి లో జరగబోయే ఈ సమావేశానికి జనసేన సభ్యులు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిదులు, రాయలసీమ కో ఆర్డినేషన్ కమిటీతో పాటు పార్టీలో కీలక నాయకులు పాల్గొంటారని జనసేన ప్రకటించింది. రాజధాని వ్యవహారం సున్నితమైన అంశం కాబట్టి మూడు ప్రాంతాల్లో జనసేన రాజకీయ ఎదుగుదలకు ఎక్కడా ఆటంకం కలగకుండా అదే సమయంలో ప్రభుత్వం పై సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేయకుండా నిర్ణయం తీసుకోవాలని జనసేన భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: