ఎప్పుడైతే పార్టీ అధికారంలోకి రాలేదో, భవిష్యత్తులోనూ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని తెలిసిందో అప్పటి నుంచి పార్టీ గురించి పట్టించుకోవడమే మానేసాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తెలంగాణ, ఆంధ్ర నాకు రెండు కళ్ళు అంటూ చెబుతూ వారానికి రెండు రోజులపాటు తెలంగాణ కు కేటాయిస్తానని చెప్పిన బాబు ముందులో ఆ నియమం పాటించినా ఆ తరువాత కాడి వదిలేసాడు. అసలు తెలంగాణ లో ఎంత చేసినా మళ్లీ పునర్వైభవం వచ్చే ఛాన్స్ లేదని ఒక అంచనాకి వచ్చిన తరువాత అక్కడి పార్టీ నేతలను సంతృప్తిపరచడానికి అన్నట్టుగా అప్పుడప్పుడూ చుట్టం చూపుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి వెళ్తున్నారు. దీంతో తెలంగాణ టీడీపీ నాయకుల వేదన అంతా ఇంతా కాదు.


 మొదటి నుంచి వారు టీడీపీని నమ్ముకుని ఉండడంవల్ల ఆ పార్టీకి దూరం అవ్వలేక, వేరే పార్టీలో చేరలేక సతమతం అవుతున్నారు. పోనీ చంద్రబాబు పార్టీని మెరుగుపరిచేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటున్నాడా అంటే అదీ లేదు. పూర్తి స్థాయిలో సమయం అంతా ఏపీకే కేటాయిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారంటూ తెలంగాణ టీడీపీ నాయకులు లబోదిబోమంటున్నారు. చంద్రబాబు కుటుంబం హైదరాబాద్ లోనే ఉంటుండటంతో శని, ఆదివారాల్లో చంద్రబాబు హైదరాబాద్ కి వచ్చి వెళ్తున్నారు. ఈ సందర్భంగా రెండు రోజుల పాటు పార్టీకి కేటాయిస్తానన్న చంద్రబాబు ఏపీలో ఓటమి పాలయిన తర్వాత తెలంగాణ టీడీపీకి ఒక్కరోజు మాత్రమే కేటాయిస్తున్నారు. అదీ శని, ఆది వారాల్లో ఏదో ఒకరోజు మాత్రమే. 


 సాయంత్రం సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చి వెళ్తున్నబాబు అక్కడ నేతలు, కార్యకర్తలతో మొక్కుబడిగా మాట్లాడి వెళ్లిపోతున్నారు.చంద్రబాబు అలా వెళ్లి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఖాళీ అవుతుంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఏదైనా కార్యక్రమం ఉంటే తప్ప ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రవకపోవడంతో అక్కడి నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదీ చంద్రబాబు వస్తేనే ఆయన పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. దీంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు  అగ్రనేతల కోసం రోజుల తరబడి వేచి చూస్తున్నారు. 


శని, ఆదివారాల్లో మాత్రం చంద్రబాబు వస్తారని ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు వస్తున్నారు. అయితే తమకు ఎల్ రమణ అందుబాటులో ఉండటం లేదని కొందరు చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తున్నారు. మరికొందరు మాత్రం చంద్రబాబు వచ్చినా పార్టీని అభివృద్ధి చేసే విషయాలపై చర్చించకుండా కేవలం అక్కడికి వచ్చిన నాయకులకు సెల్ఫీలు ఇస్తూ హడావుడి చేయడం తప్ప మరే ఉపయోగం ఉండడంలేదని మరొకొందరు వాపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: