మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనుంది తెలంగాణ తెలుగు దేశం పార్టీ. గతంలో జరిగిన ఎన్నికల్లో పొత్తులు, మద్దతును పేరుతో పార్టీ నష్టపోయిందని.. ఇకనైనా తెలంగాణలో పార్టీ నిలబడాలంటే, ఒంటరిగానే పోటీ చేయాలని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అనుమతి తీసుకున్నారు తెలంగాణ నేతలు.

 

తెలంగాణలో అన్ని పార్టీల పరిస్థితులు ఒకలా ఉంటే.. తెలంగాణ టీడీపీ పరిస్థితి మరోలా ఉంది.. ఎన్నికలొస్తే ఇతర పార్టీలతో పొత్తు.. లేదంటే ఎన్నికల్లో పోటీ చేయకుండా మరో పార్టీకి మద్దతు అనే దుస్థితిలో ఉంది. తెలంగాణా తెలుగు తమ్ముళ్లు మాత్రం ఈసారి ఒంటరిగా మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగాలని డిసైడ్‌ అయ్యారు. పోటీ చేసి తామేంటో నిరూపించుకోవాలనుకుంటున్నారు. 

 

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి ప్రతికూల ఫలితాలు వచ్చాక.. చంద్రబాబు వారంలో ఒక రోజు తెలంగాణకు కేటాయిస్తున్నారు. ప్రతి శనివారం సాయంత్రం టీ-టీడీపీ నేతలతో భేటీ అవుతున్నారు.. తెలంగాణలో పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. దీంతో ఏ అవకాశం వచ్చినా పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలనుకుంటున్నారు తెలంగాణ నేతలు. 

 

తెలంగాణలో జరిగిన ముందస్తున్న ఎన్నికల్లో కాంగ్రెస్- టీడీపీ కలిసి పోటీ చేశాయి.. ఈ రెండు పార్టీలే కాదు ప్రజాకూటమి పేరుతో సీపీఐ, తెలంగాణ జన సమితి లను కలుపుకుని పోటీ చేశారు. 13 స్థానాల్లో పోటీ చేసి రెండు స్థానాలు పార్టీ దక్కించుకున్నా... ఇపుడు ఒక్కరే మిగిలారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. స్థానిక సంస్థల్లో అక్కడక్కడ బయట పడ్డారు. అయితే ఈ సారి మాత్రం పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్నారు. 

 

పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల ఎజెండాగా తెలంగాణ తెలుగు దేశం పార్టీ నాయకుల సమావేశం జరిగింది. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు.. మున్సిపల్ ఎన్నికలు.. రిజర్వేషన్ల వంటి అంశాల పై సుదీర్ఘ చర్చ సాగింది. మొత్తానికి మున్సిపల్ బరిలో ఒంటరిగానే పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు తెలుగు తమ్ముళ్లు..

>>

మరింత సమాచారం తెలుసుకోండి: