కాంగ్రెస్ నేత ప్రియాంక‌గాంధీ గురించి బీజేపీ నాయ‌కుడు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.
లక్నోలో స్కూటర్‌పై ప్రియాంకా గాంధీ వెళ్ల‌డం ఆస‌క్తిని రేకెత్తించ‌డ‌మే కాకుండా....వివాదాన్ని సైతం సృష్టించింది. ప్రస్తుతం ప్రియాంకాకు జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పిస్తున్నారు. అయితే ఆమెకు భ‌ద్ర‌త క‌ల్పించ‌లేద‌నే ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై క్లారిటీ ఇస్తూ...మ‌రో అంశంలోనూ కిష‌న్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. సీఏఏకు అనుకూలంగా ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ...లక్నోలో ప్రియాంకా గాంధీ భద్రతా నియమావళిని ఉల్లంఘించినట్లు జర్నలిస్టులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. గాంధీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికీ భద్రత నియమావళిని ఉల్లంఘించి అలవాటు ఉందన్నారు. సెక్యూర్టీ అధికారులకు తెలియజేయకుండానే టూర్లు చేయడం వాళ్లకు అలవాటుగా మారిందన్నారు. అలాంటి వాళ్లు భద్రత గురించి ప్రశ్నించే హక్కు లేదన్నారు.

 


పౌరసత్వ సవరణ చట్టం గురించి సైతం కిష‌న్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ చ‌ట్టం ఏ ఒక్క భారతీయ పౌరుడికి వ్యతిరేకం కాదని అన్నారు.  సీఏఏలో భారతీయ ముస్లింల గురించి కానీ ఇతర మతాలు గురించి కానీ ఎటువంటి అంశం లేదన్నారు. భారతీయ ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే, కాంగ్రెస్‌ పార్టీ ఆ అంశాన్ని రాజకీయం చేస్తోందన్నారు. ఈ చట్టం విషయంలో కాంగ్రెస్‌ పార్టీ దేశం మొత్తాన్ని తప్పుదోవ పట్టిస్తోందన్నారు. కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. 2015లో లోక్‌సభలో సీఏఏ పాసైడనప్పుడు కాంగ్రెస్‌ ఎందుకు వ్యతిరేకించలేదన్నారు. ఈ అంశంపై రాహుల్‌తో చర్చించేందుకు బీజేపీ వర్కర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా రాహుల్‌తో డిబేట్‌కు రెఢీగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

 

ఇప్ప‌టికే సీఆర్పీఎఫ్ సైతం క్లారిటీ ఇచ్చింది. ప్రియాంకా గాంధీ పర్యటనలో ఎటువంటి సెక్యూర్టీ ఉల్లంఘన జరగలేదని సీఆర్‌పీఎఫ్‌ చెప్పింది. స్కూటర్‌పై వెనక సీటులో కూర్చుని ప్రియాంకా వెళ్లిందని, ఆమె భద్రతా నియమావళిని ఉల్లంఘించినట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం ప్రియాంకాకు జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పిస్తున్నప్ప‌టికీ...ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే కాంగ్రెస్‌ నేత ట్రిప్‌కు వెళ్లారని, అందువల్లే ముందస్తు చెకింగ్‌ జరగలేదని సీఆర్‌పీఎఫ్‌ తన ప్రకటనలో చెప్పింది. టూర్‌ సమయంలో ప్రియాంకా నాన్‌ బుల్లెట్‌ రెసిస్టాంట్‌ వెహికిల్‌ను వాడారని, అది కూడా భద్రతా అధికారి లేకుండానే వెళ్లారని సీఆర్‌పీఎఫ్‌ వెల్లడించింది. పిలియన్‌ రైడర్‌ రూపంలో ప్రియాంకా వెళ్లినట్లు చెప్పారు. ప్రియాంకా ఎటువంటి సమాచారం ఇవ్వకపోయినా.. ఆమెకు పూర్తి భద్రతను కల్పించామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: