ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఉన్న పాపికొండ‌ల గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశౄరు. ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పడకముందు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మరియు  ఖమ్మం జిల్లాల నడుమ ఉన్న ఈ కొండ‌ల‌ను త‌ల‌ద‌న్నేలా తెలంగాణ‌లో ప‌రిస్థితులు మారిపోయ‌యాని కేసీఆర్ పేర్కొన్నారు. తాను గ‌తంలో చెప్పిన మాట‌ను నేడు ఆచ‌ర‌ణ‌లో అమ‌లు చేసి చూపిస్తున్న‌ట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్‌ భాగంగా ఉన్న మిడ్‌మానేరు లింక్ ప్రాజెక్టును సంద‌ర్శించిన కేసీఆర్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ పై కామెంట్లు చేశారు. 

 

త‌న ప‌ర్య‌ట‌న‌లో పూజ‌లో పాల్గొన్న కేసీఆర్ ఈ సంద‌ర్భంగా గ‌త అనుభ‌వాల‌ను వివ‌రించారు. ``మిడ్‌ మానేరు ప్రాజెక్టు మీద నిలుచొని పూజ చేస్తున్నప్పుడు చాలా ఆనందం కలిగింది. జీవితంలో సఫలత్వం కలిగినట్లు అనుభూతి కలిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గోదావరి ఒడ్డున ఉన్న జిల్లాలు సంపూర్ణమైన వివక్షకు గురయ్యాయి. వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌, కరీంనగర్‌, నిర్మల్‌ ఏరియాల్లో కరువు ఉండకూడదు. కాని తీవ్ర వివక్ష కారణంగా ఈ జిల్లాలు కరువుతో అల్లాడిపోయాయి. తెలంగాణ రాష్ట్రం సాకారమైతే గోదావరి డేల్టాకంటే అద్భుతంగా ఉంటాయని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది.`` అని తెలిపారు. 

 


కరీంనగర్‌ జిల్లాలో మొత్తం 46 వాగులు ఉన్న‌ప్ప‌టికీ...క‌రువు బారిన ప‌డింద‌ని కేసీఆర్ అన్నారు. `` ఇన్ని వాగులు ఉండి కూడా కరువుకాటకాలకు లోనైంది. ఇదే జిల్లా నుంచి దుబాయి, గల్ఫ్‌ దేశాలకు వలసలు వెళ్లారు. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలు పూర్తిగా కరువు భారిన పడ్డాయి. ఏడు వందల నుంచి 9 వందల ఫీట్ల వరకు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. కరువు కాటకాలతో తాండవం చేసిన పాత కరీంనగర్ జిల్లా.. ఈ జూన్ తర్వాత పాలుగారే జిల్లాగా కళకళలాడుతుంది. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయితే కూడా పంటలు అద్భుతంగా పండుతాయి. ఇందుకోసమే చెక్ డ్యాంలు నిర్మిస్తాం. కాళేశ్వరం పూర్తయితే కరీంనగర్ అద్భుతంగా తయారవుతుంది. లండన్ లోని థేమ్స్ నదిలా మిడ్ మానేరు కనిపిస్తుందిని చెప్పారు. పాపికొండలను తలదన్నేలా సిరిసిల్ల కొండలు ఉంటాయి.` అని సీఎం కేసీఆర్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: