ఏ వంకా లేనోడు డొంక పట్టుకుని వెళాడాడు అనే సామెత ఊరికే పుట్టలేదు.రాజకీయంగా ఏపీలో బలపడలేక పోతున్నామనే బాధలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదో ఒక విషయంపై అధికార పార్టీ మీద విమర్శలు చేస్తూ రాజకీయంగా ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే పవన్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆయన చంద్రబాబుకు నమ్మినబంటు గానే ప్రజలు గుర్తిస్తూ పవన్ ను పెద్దగా పట్టించుకోవడం మానేశారు. ఇక ఏపీ రాజధాని విషయంలో ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న పవన్ ఈ రోజు పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక విషయాలు గురించి పార్టీ నాయకులతో చర్చించిన పవన్ రేపు రాజధాని అమరావతిలోని రాజధానికి భూములు ఇచ్చిన గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. 


 దీనికి సంబంధించి వివిధ అంశాలతో కూడిన బుక్ లెట్లను పార్టీ కార్యాలయంలో పవన్ పంచిపెట్టారు. రాజధాని అంశాన్ని ఉపయోగించుకుని అధికార పార్టీని ఏదో ఒకరకంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో ఉన్న పవన్ దానికి అనుగుణంగానే అడుగులు ముందుకు చేసుకుంటూ వెళ్తున్నాడు. పవన్ పర్యటనకు సంబంధించి వివరాలను పార్టీ కార్యాలయం ప్రకటించింది. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి పవన్ పర్యటన ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి ఎర్రుపాలెం మండలం, వెలగపూడి తుళ్లూరు, గ్రామాల మీదుగా పవన్ యాత్ర కొనసాగుతున్నట్లు పార్టీ కార్యాలయం తెలిపింది.


 ఈ సందర్భంగా రైతులు రైతు కూలీల తో పవన్ స్వయంగా మాట్లాడతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పవన్ పర్యటనపై ముందే సమాచారం తెలుసుకున్న అమరావతి పరిరక్షణ సమితి నాయకులు మంగళగిరి జనసేన కార్యాలయానికి వచ్చి పవన్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13 రోజులుగా తాము పోరాటం చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు అని వాపోయారు. దీనిపై స్పందించిన పవన్ జనసేన పార్టీ తరఫున అన్ని రకాలుగా అండగా నిలుస్తామని ప్రకటించారు. అయితే పవన్ పర్యటనపై అనేక అనుమానాలు ముసురుకున్నాయి.గతంలో రాయలసీమలో పర్యటించిన పవన్ ఏపీకి అమరావతి రాజధాని కావచ్చు కానీ నాకు మాత్రం కర్నూలులో రాజధాని అని ప్రకటించారు.


 ఇప్పుడు మాత్రం వైసిపి ప్రభుత్వాన్ని ఇబ్బందులపాలు చేసే విధంగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా పవన్ రాజకీయ ఎత్తుగడలు వేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన అనంతరం పవన్ అన్న చిరంజీవి జగన్ కు మద్దతు ప్రకటించడం, మూడు ప్రాంతాల్లో సమాన అభివృద్ధి జరగాలని జగన్ చిరంజీవి అభినందించడం జరిగాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పవన్ మాత్రం చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ అమరావతి ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు పవన్ మూట కట్టుకుంటున్నారు. ప్రస్తుతం అమరావతిలో పవన్ పర్యటించినా ఆయనకు రాజకీయంగా ఒరిగేది ఏమీ ఉండదు అనేది కొంతమంది రాజకీయ మేధావుల అభిప్రాయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: