తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. తెలుగుదేశంపార్టీలో ఉన్నంత కాలం ఇద్దరూ చంద్రబాబునాయుడుకు కుడి, ఎడమ భుజాల్లాగ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. పార్టీ నిర్ణయాల్లో వీళ్ళిద్దరూ చాలా కీలకంగా ఉండేవారు.  విచిత్రమేమిటంటే ఇద్దరి మీద దాదాపు ఒకే విధమైన ఆర్ధిక ఆరోపణలున్నాయి. ఎందుకంటే అధికారాన్ని అడ్డుపెట్టుకుని అందినకాడికి ఇద్దరూ దోచేసుకున్నారు. చంద్రబాబు గుట్టుమట్లు వీళ్ళిద్దరికే బాగా తెలుసు. 

 

అందుకనే టిడిపి ఘోరంగా ఓడిపోగానే  ఇద్దరినీ చంద్రబాబే బిజెపిలోకి ముందు జాగ్రత్తగా పంపారనే ప్రచారం అందరికీ తెలిసిందే.  సరే వాళ్ళే వెళ్ళినా చంద్రబాబే పంపినా బిజెపిలోకి ఫిరాయించిన తర్వాత వీళ్ళిద్దరికీ ఏమాత్రం పడటం లేదని అర్ధమైపోతోంది. కేంద్రప్రభుత్వంలోని పెద్దలతో సన్నిహితంగా మెలగాలని ఇద్దరు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేసుకోవటం వల్ల ఆధిపత్య సమస్యలు మొదలైనట్లు సమాచారం.

 

తాజాగా రాజధాని విషయంలో రమేష్ చేసిన వ్యాఖ్యలతో ఆ విషయం బయటపడింది. రాజధానిని అమరావతి నుండి జగన్మోహన్ రెడ్డి ఒక అంగుళం కూడా కదల్చలేరని కేంద్రప్రభుత్వ మాటగానే తాను చెబుతున్నట్లు సుజనా చౌదరి చెప్పిన విషయం అందరికి తెలుసు. ఇదే విషయమై రమేష్ మాట్లాడుతూ రాజధాని మార్పు విషయంలో కేంద్రప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అంటే సుజనా గాలిని రమేష్ తీసేశారు.

 

నిజానికి ఇద్దరూ ఒకేపార్టీ నుండి బిజెపిలోకి ఫిరాయించారు. ఇద్దరి నేపధ్యమూ దాదాపు ఒకటే. ఇద్దరూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులే. అయినా కానీ రాజధానుల విషయంలో సుజనా ఇచ్చిన బిల్డప్ కు రమేష్ కౌంటర్ ఇవ్వటం అందరినీ ఆశ్చర్యపరిస్తోంది. అంటే ఏ స్ధాయిలో ఇద్దరి మధ్య ఆధిపత్య గొడవలు జరుగుతుంటే  పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తారు ? పైగా సుజనాను ఇబ్బంది పెట్టటానికే రమేష్ ఉద్దేశ్యపూర్వకంగానే  వ్యాఖ్యలు చేశారని అర్ధమైపోతోంది.

 

అది కాకుండా మొన్ననే కడపలో నేరుగా జగన్ ను కలిసి బొకే ఇవ్వటమే కాకుండా శాలువా కప్పటం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. జగన్ అంటేనే సుజనా భగ్గున మండుతుంటే రమేష్ మాత్రం అవకాశం దొరికితే జగన్ ను కలుద్దామని చూడటం కూడా ఇద్దరి మధ్య గ్యాప్ పెంచేసిందని సమాచారం. వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెరిగిపోతే ముణిగేది చంద్రబాబు కొంపే అన్న విషయం అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: