పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ప్రతిపాదిత జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ) విష‌యంలో నిర‌స‌న‌ల తీరు మారుతోంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల్లో మ‌రిన్ని కొత్త వ‌ర్గాలు చేరుతున్నాయి. సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు భిన్న రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. చెన్నైలోని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ నివాసం సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక ఆందోళనకు సోమవారం కేంద్రమైంది. ఆయన ఇంటిముందు సీఏఏ-ఎన్సార్సీ వెండాం(అవసరం లేదు/ వద్దు) అని పేర్కొంటూ ముగ్గు వేశారు. 

 


పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా నగర నడిబొడ్డున సుమారు 100 మంది హిందూ పూజారులు సోమవారం నిరసనకు దిగారు. మయో రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బైఠాయించిన పూజారులు సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాకు పశ్చిమ బంగా సంఘటన్ బ్రాహ్మిణ్ ట్రస్ట్ నాయకత్వం వహించింది. ఇక ఇదే న‌గ‌రంలో మ‌రో నిర‌స‌న సాగింది. కొన్ని రోజులుగా సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై పోలీసుల దమనకాండకు నిరసనగా ఆందోళ‌న‌లు సాగాయి. జామియా మిలియా ఇస్లామియా, అలీగడ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల చర్యను నిరసిస్తూ కోల్‌కతాలోని సెయింట్ జావియర్ కళాశాల విద్యార్థులు మౌన ప్రదర్శన చేపట్టారు. ఢిల్లీలో లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా సాగింది.

 


మరోవైపు రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ప్రతిపాదిత జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ) విష‌యంలో జ‌రుగుతున్న‌ నిర‌స‌నలు రైల్వేకు భారీ న‌ష్టం చేస్తున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌ల్లో రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన సీఏఏ వ్యతిరేక ఆందోళనకారుల నుంచే పరిహారం వసూలు చేస్తామని తెలిపారు. ఈ మేర‌కు ఆందోళ‌న‌ల‌కు పాల్ప‌డిన వారిని గుర్తిస్తున్న‌ట్లు రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్  వెల్ల‌డించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: