ఏపీలో రాజుకున్న అమరావతి అనే చిచ్చు దగ్గర చలి కాగేందుకు జనసేన అధినేత పవన్ సిద్ధం అయిపోయారు. దానిలో భాగంగానే జై అమరావతి నినాదాన్ని తలకెత్తుకుని హడావుడిగా పవన్ ముందుకు దూకారు. నిన్న మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో పవన్ అనేక విషయాల గురించి చర్చించారు.ఈ సంద్రాభంగా ఈరోజు అమరావతిలో పర్యటన చేసి రైతులు, ప్రజల మనోభావాలు తెలుసుకుంటాను అంటూ పవన్ ప్రకటించారు. అమరావతిలో రైతుల పేరుతో టీడీపీ అనుకూల వర్గాలకు చెందిన వ్యక్తులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించేందుకు పవన్ సిద్ధమైపోయారు. అమరావతి ప్రాంతంలోని ఎర్రబాలెం, మందడం, వెలగపూడి తుళ్లూరు లో పవన్ పర్యటన చేపట్టి రైతులతో రాజధాని వ్యవహారంపై చర్చించి వారికి సంఘీభావం తెలిపేందుకు పవన్ పర్యటన చేపట్టారు.


 అయితే పవన్ ఇప్పుడు జై అమరావతి అనే నినాదం తలకెత్తుకోవడం వెనుక ఆయన రాజగురువు చంద్రబాబు హస్తం ఉన్నట్లుగానే ప్రజలంతా భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అడుగు జాడల్లోనే నడుస్తూ ఆ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటే అదే ఫాలో అవుతూ పవన్ రాజకీయ అడుగులు ఇప్పటి వరకు పడుతూ వచ్చాయి. కేవలం వైసిపిని టార్గెట్ చేసుకుంటూనే పవన్ రాజకీయాలు చేస్తున్నాడు. ఈ విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. దీనికి నిదర్శనంగానే ఆ పార్టీకి కేవలం ఒకే ఒక్క సీటు అది కూడా అక్కడి అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్ తో మాత్రమే రాజోలులో గెలుపొందారు.


అకస్మాత్తుగా పవన్ జై అమరావతి నినాదం ఎత్తుకోవడం వెనుక కారణాలను పరిశీలిస్తే మొదటి నుంచి భారీగా ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆ పార్టీ బాగా వెనుకబడి పోవడంతో పాటు రాయలసీమలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జనసేన ఉనికి కోసం పోరాడుతోంది. దీని నుంచి బయటపడేందుకు పవన్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక ఒక సమస్యను హైలెట్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లడం, ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో యూటర్న్ తీసుకోవడం షరా మామూలైపోయింది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై తెలుగుదేశం కంటే పవన్ తీవ్రస్థాయిలో ఆవేశంతో అప్పట్లో ఊగిపోయారు. తెలుగు భాషను జగన్ చంపేస్తారా అంటూ హడావుడి చేశాడు. మన నుడి మన ఒడి అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించ తలపెట్టిన ఆదిలోనే ముగింపు పలికాడు.


 క్షేత్రస్థాయిలో జగన్ నిర్ణయానికి జేజేలు పలకడంతో నేను వద్దు అనలేదు వదలొద్దు అన్నాను అంటూ మాట మార్చదు. ఇక మూడు రాజధానుల విషయంలో జగన్ నిర్ణయానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుండడం, అటు చంద్రబాబు ఇటు పవన్ జీర్ణించుకోలేక ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చేసేందుకు రాజధానిలో హడావుడిగా పవన్ పర్యటన మొదలు పెట్టాడు. దీనిపై ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పోనీ అమరావతిలో పవన్ పర్యటించడం వల్ల రాజకీయంగా జనసేనకు ఏమైనా కలిసి వచ్చేంది ఉందా అంటే అదీ లేదు.


 తెలుగుదేశానికి కంచుకోట లా ఉండే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే ఆ పార్టీని జనం ఆదరించ లేదు. ఇప్పుడు పవన్ కొత్తగా అమరావతి విషయంలో హడావుడి చేసినా ఆ పార్టీకి గుర్తింపు మాత్రం అంతంత మాత్రమే. కానీ దీని కారణంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది. ప్రజలు కూడా పవన్ వ్యవహారశైలిని గమనిస్తున్నారు. టిడిపి ఆడమన్నట్టు ఆడే ఒక తోలు బొమ్మగానే పవన్ ను జనాలు చూస్తున్నారు. ఈ విషయం ఆ పార్టీలోని చాలామంది  నాయకులకు తెలుసు పవన్ ఒక్కడికే ఈ విషయం తెలియడంలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: