భారత ప్రథమ డిఫెన్స్ స్టాఫ్‌గా బిపిన్ రావత్ నియమితులయ్యారు. భారత ఆర్మీ అధ్యక్షుడిగా పదవీ విరమణ చేసిన రావత్..  మరో ప్రముఖమైన పదవిని అలంకరించనున్నారు. ఇంతకూ రక్షణ రంగంలో ఈ డిఫెన్స్ స్టాఫ్ ప్రాముఖ్యత ఏంటి.? దీనివల్ల దేశ రక్షణ వ్యవస్థకు కలిగే లాభాలేంటి.. దీని తర్వాత ఎలాంటి సంస్కరణలను అమలు చేయాలని ఆర్మీ కోరుతోంది. 

 

ఆర్మీచీఫ్‌గా బిపిన్ రావత్.. సమర్థవంతంగా తన విధులు నిర్వర్తించారు. డోక్లామ్ వివాదంలో చైనాకు ధీటుగా బలగాలు నడిపారు. ఓ దశలో సియాచిన్ సమీపంలో ఇరు దేశాల సైనికుల మధ్య తోపులాటలు జరిగినా.. వాటిని శ్రుతిమించకుండా అదుపు చేయగలిగారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే.. పీఓకేను ఆక్రమిస్తామని .. పాక్‌కు గట్టిగా బదులిచ్చారు. అలాంటి వ్యక్తిని ఏరికోరి ప్రభుత్వం .. దేశ ప్రథమ ఢిఫెన్స్ స్టాఫ్‌గా నియమించింది. నేడు ఆర్మీ చీఫ్ పదవి నుంచి రిటైర్ కానున్న రావత్.. రేపు ఢిఫెన్స్ స్టాఫ్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పదవిలో ఉండేవారికి గరిష్ట వయోపరిమితి 65 ఏళ్లుగా కేంద్రం నిర్ణయించింది.

 

డిసెంబర్ 24న ఛీప్‌ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ పోస్టు ఏర్పాటుకు కేంద్రకేబినెట్ ఆమోదం తెలిపింది. సీడీఎస్ విధుల్లోకి వస్తే.. త్రివిధ దళాలకు సంబంధించి , రక్షణమంత్రికి ప్రిన్సిపల్ మిలటరీ అడ్వైజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఛీప్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ .. ప్రభుత్వానికి సింగిల్ పాయింట్  మిలటరీ అడ్వైజర్.. త్రివిధ దళాలకు అవసరమైన ప్లానింగ్, మౌలిక అవసరాలు, శిక్షణ, లాజిస్టిక్స్ .. తదితరఅంశాల్ని సమన్వయం చేస్తారు. బడ్జెట్‌లో మూడు దళాల అవసరాలు, వాటికి సంబంధించి బలోపేతం చేయడంపైనా కసరత్తు చేస్తారు.

 

ఇక ఈ చీఫ్‌ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ను.. జనరల్ నెంబర్ 1 అని పిలుస్తారు. త్రివిధ దళాలకు 4 స్టార్ జనరల్స్... చీఫ్‌లుగా వ్యవహరిస్తారు. అయితే వీరందరూ.. వారి దళాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈయన మాత్రం మూడు దళాలకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తారు. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో కనిపించిన సమస్యలను అధ్యయనం చేసిన హైలెవల్ కమిటీ.. చీఫ్‌ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. తదనంతరం జాతీయ రక్షణ వ్యవస్థలో సంస్కరణలు తేవాల్సి ఉందని కేంద్ర మంత్రుల బృందం అధ్యయనం కూడా స్పష్టం చేసింది. ఇక 2012లో నరేష్ చంద్ర టాస్క్ ఫోర్స్ సైతం.. చీఫ్‌ ఆఫ్ డిఫెన్స్ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. 

 

భారత ప్రథమ ఢిఫెన్స్ స్టాఫ్‌ను ఏర్పాటు చేసిన తర్వాత.. దేశ రక్షణ వ్యవస్థ విస్తరణలో భాగంగా ఏకీకృత థియేటర్ కమాండ్‌పై రక్షణశాఖ దృష్టి పెట్టింది. అన్ని మిలటరీ వ్యవస్థలు..ఒకే ఆపరేషనల్ కమాండ్ కిందకు వచ్చేలా చేయడం ద్వారా.. కొద్దిపాటి వనరులతో ఎఫెక్టివ్‌గా ఆపరేషన్స్ నిర్వహించొచ్చని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశానికి 17 సింగిల్ సర్వీస్ కమాండ్స్ ఉండగా..అండమాన్ అండ్ నికోబార్ రూపంలో రీజినల్ కమాండ్, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ల రూపంలో రెండు ట్రై కమాండ్ సర్వీసులున్నాయి. ఇవి న్యూక్లియర్ వెపన్స్‌ను ఆపరేట్ చేస్తాయి. భూతల, వాయు, సముద్రంపై రక్షణశాఖ చేపట్టే ఆపరేషన్లను.. పర్యవేక్షించేందుకు... థియేటర్ కమాండ్‌ ఏర్పాటు అవసరముందని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: