వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇలా ఇబ్బంది పెడదామా అనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల్లో మరింత మంచి పేరు తెచ్చుకుంటూ ఉండడంతో ఈ రెండు పార్టీలకు మింగుడు పడడం లేదు. అందుకే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశం ఏది దొరికినా దానిని తమకు అనుకూలంగా మార్చుకుని విమర్శలు చేయడమే కాకుండా ప్రజలను రెచ్చగొట్టి తమకు రాజకీయంగా కలిసి వచ్చేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వీరి మీద ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే చంద్రబాబు అనుకూల మీడియా వీరి ఆందోళనను, పోరాటాలను బాగా హైలెట్ చేస్తూ ఏపీలో ఏదో జరిగిపోతుందనే భ్రమను  కల్పిస్తున్నారు. 


తాజాగా అమరావతి  విషయంలో ఇదే రకమైన హడావుడి చేస్తూ రైతులను,  స్థానిక ప్రజలను రెచ్చగొట్టే పనిలో పడ్డారు. ఈ విషయంలో చంద్రబాబు బాటలోనే పవన్ నడుస్తూ ఈ సమస్యను మరింత జటిలం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్ చంద్రబాబు చేస్తున్న ఈ హడావుడికి  ఏపీ మంత్రి కన్నబాబు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. సంక్షేమ అభివృద్ధి ఈ రెండిటిని ఏకతాటిపై తీసుకు వెళుతున్న ఏపీ సీఎం జగన్ కు మైలేజ్ రాకుండా చేసేందుకే పవన్ చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేయాలని నిరంతరం జగన్ ఆలోచిస్తూ ఉంటారని, మీరు చేసిన అభివృద్ధి ఎటువంటిదో ప్రజలకు అర్థమైంది కాబట్టే 2019 ఎన్నికల్లో గొప్ప తీర్పునిచ్చారు అంటూ కన్నబాబు చెప్పారు.


చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాజధాని తరలిపోతున్నట్టు అదే పనిగా గగ్గోలు పెడుతూ అనవసర రాద్ధాంతం చేస్తూ, ప్రజలను రెచ్చగొడుతున్నారని, అసలు రాజధాని తరలిపోతుందని మీకు ఎవరు చెప్పారు ? ప్రభుత్వంలో ఎవరైనా మీకు చెప్పారా అని ప్రశ్నించారు. అమరావతిలో కూడా రాజధాని ఉంటుందని, అధికార వికేంద్రీకరణ జరగాలని డిమాండ్ ఉంది కాబట్టే జగన్ హై పవర్ కమిటీ ని నియమించారని చెప్పారు. కానీ చంద్రబాబు పవన్ భ్రమల్లో బ్రతుకుతూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని, అమరావతిని వైసీపీ ప్రభుత్వం ఎడారిగా మారుస్తుంది అంటూ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. 


తెలుగుదేశం పార్టీకి కేవలం 29 గ్రామాల ప్రజల ప్రయోజనాలే ముఖ్యమా లేక రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మీకు వద్దా ? రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల బాధలు మీరు పట్టించుకోరా చంద్రబాబు గారు ? మీరు అమరావతి లో మాట్లాడే మాటలు విశాఖ కర్నూలు వెళ్లి మాట్లాడగలరా అంటూ నిలదీశారు. విభజన వద్దు పరిపాలన అంతా ఒకే చోట ఉండాలని కర్నూలు ఉత్తరాంధ్ర వెళ్లి చెప్పగలరా ? అంత ధైర్యంగా వెళ్లి మాట్లాడే సత్తా ఉందా అంటూ చంద్రబాబు ఉద్దేశించి మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి వద్దా ? పరిపాలన వికేంద్రీకరణ వద్దా ?  హైదరాబాద్, బెంగళూరు స్థాయిలో ఉండాలంటే ఎన్నాళ్లకు రాజధానిని నిర్మించాలి.


 అమరావతి లో కూర్చుని పెద్ద పెద్ద మాటలు చెప్పే పవన్ కళ్యాణ్ గాజువాక వెళ్లి ఆ మాటలు చెప్పగలరా అని కన్నబాబు నిలదీశారు. అయితే ఈ ప్రశ్నలకు టిడిపి, జనసేన నుంచి సమాధానం రాలేదు. కన్నబాబు లేవనెత్తిన ప్రశ్నలు వాస్తవానికి దగ్గరగా ఉండడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీటికి కౌంటర్ ఇచ్చేందుకు భపడుతున్నారని వైసీపీ నేతలు విమర్శలు మొదలుపెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: