మోసాల్లో కొత్త కోణం. త‌ప్పుడు ప‌నుల్లో ఆరితేరిన వారు సైతం అవాక్క‌య్యే రీతిలో జ‌రిగిన స్కాం. తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఈఎస్ఐ స్కాం విష‌యంలో మ‌రిన్ని అంశాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. మెడికల్‌ పరీక్షల కిట్ల కొనుగోలులో ఎలాంటి ఇండెంట్లు లేకుం డా, కొనుగోలు ఆర్డర్లు సృష్టించి.. వందల రెట్లు మార్జిన్లు పెంచి అడ్డగోలుగా దోచుకున్నట్టు తెలుస్తున్నది. ఇలా సంపాదించిన సొమ్ముతో కోట్ల విలువైన షేర్లు.. డిపాజిట్లు ఈ ఘ‌రానా బాబులు సొంతం చేస‌కున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది.

 


ఐఎంఎస్‌ స్కాం లో బెయిల్‌పై బయట ఉన్న ఓమ్నిమెడి ఎండీ శ్రీహరిబాబుతో లీల‌లు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. 2017-18లో మెడికల్‌ కిట్ల కొనుగోలు కోసం ప్రభుత్వం ఐఎంఎస్‌కు రూ.110 కోట్ల కేటాయించింది. ఇందుకు సంబంధించిన కొనుగోళ్లపై ఏసీబీ ఆరాతీయగా కోట్ల రూపాయల మోసం వెలుగులోకి వచ్చింది. ఓమ్నిమెడి ఎండీ శ్రీహరిబాబుకు చెందిన షెల్‌ కంపెనీలైన లెజెండ్‌, ఓమ్ని హెల్త్‌కేర్‌లకు ఐఎంఎస్‌ డైరెక్టర్‌ దేవికారాణి, జేడీ పద్మ కలిసి మందుల కిట్ల కొనుగోలు ఆర్డర్లను ఇప్పించినట్టు తెలిసింది. హిమోక్యూ ప్రొడక్ట్‌ అనే స్వీడన్‌ కంపెనీ తయారుచేసిన పలురకాల మెడికల్‌ పరీక్షల కిట్లను స్థానికంగా ఉన్న లెజెండ్‌ కంపెనీ ద్వారా కొనుగోలుచేసినట్టు పత్రాలు సృష్టించారు. అవసరం లేకపోయినప్పటికీ డిస్పెన్సరీల నుంచి కిట్లు వచ్చినట్టు ఇండెంట్లు సృష్టించారు. ఏసీబీ అధికారులు డబ్ల్యూబీసీ క్యువెట్టిస్‌ (తెల్లరక్తకణాల సంఖ్య ను తెలుసుకునే పరీక్ష కిట్లు), గ్లూకోజ్‌ స్థాయి తెలుసుకునే కిట్లకు సంబంధించిన కొనుగోళ్లను పరిశీలించారు. డబ్ల్యూబీసీ క్యువెట్టిస్‌ ఒక్కోకిట్‌ ధర రూ.11,800 ఉండగా.. దాన్ని రూ.36,800కు పెంచి కొనుగోలు చేసినట్టు ఉన్న పత్రాలను గుర్తించారు. ఇలా మొత్తం 6,291 కిట్లు కొనుగోలు చేసినట్టు ఉంది. అదేవిధంగా గ్లూకోజ్‌శాతాన్ని తెలుసుకునే కిట్ల ధర రూ.1950కి గాను రూ.6,200కు పెంచారు.

 

మ‌రోవైపు నిందిత‌లు మోస‌పు తెలివితేట‌లు ఓ రేంజ్‌లో ఉన్నాయ‌ని స్ప‌ష్ట‌మైంది. వాస్తవానికి ఫార్మా కంపెనీల మార్జిన్‌ ఎక్కువలో ఎక్కువ 25 శాతం వరకు ఉంటుంది. కానీ దానిని ఏకంగా 250 శాతానికి పెంచి దండుకున్నారు. ఇలా మొత్తం రూ.19 కోట్ల మేర ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టినట్టు ఆధారాలు లభించాయి. ఈ సొమ్ము ఐఎంఎస్‌ డైరెక్టరేట్‌ నుంచి లెజెండ్‌ కంపెనీల ఖాతాల్లోకి.. అక్కడి నుంచి శ్రీహరిబాబు ఖాతాలోకి జమ అయినట్టు ఆధారాలు లభించినట్టు తెలిసింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: