స్థానిక సంస్థల ఎన్నికల పై ఎమ్‌ఐఎమ్‌ దృష్టి సారించింది. ముస్లిం మైనార్టీ జనాభా ఎక్కువగా ఉండే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునే దిశగా కసరత్తు ప్రారంభించింది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ నేపథ్యంలో ముస్లిం ఓట్‌ బ్యాంక్‌ మరింత ఎక్కువగా కన్సాలిడేట్‌ అవుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

 

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో సత్తా చాటేందుకు ఎమ్‌ఐఎమ్‌ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల అవటంతో అభ్యర్ధుల ఎంపిక కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉండే చోట్ల అభ్యర్ధుల్ని మోహరించనుంది మజ్లిస్‌ పార్టీ. 2014 మున్సిపల్‌ ఎన్నికల్లో ఎమ్‌ఐఎమ్‌ కొన్ని ప్రాంతాల్లో గట్టి పోటీ ఇచ్చింది. ఆదిలాబాద్‌, తాండూర్‌, నిర్మల్‌, భైంసా మున్సిపాలిటీలు, నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో మజ్లిస్‌కి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు పడ్డాయి. ఆదిలాబాద్‌, భైంసా మున్సిపాలిటీలు మజ్లిస్‌ ఖాతాలో పడగా, నిజామాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్‌ పదవి ఎమ్‌ఐఎమ్‌కే దక్కింది. ఈసారి మేయర్‌ పదవిని దక్కించుకునే విధంగా పావులు కదుపుతున్నారు ఒవైసీ బ్రదర్స్‌. మరోవైపు తాండూర్‌ వంటి మరికొన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌తో అధికారాన్ని పంచుకుంటోంది. ముస్లిం జనాభా పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండటంతో పట్టణ స్థానిక సంస్థలపై పార్టీ హైకమాండ్‌ దృష్టి సారించింది. 

 

ఈ సారి ఎన్నికల్లో కామారెడ్డి, బోధన్‌, జగిత్యాల, ఆర్మూర్‌, సంగారెడ్డి, మెదక్‌, శంషాబాద్‌, హుజూరాబాద్‌, సుల్తానాబాద్‌, హుస్నాబాద్‌లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు సమాచారం. ఇవి కాకుండా కొత్తగా ఏర్పడిన బడంగ్‌పేట, బండ్లగూడ జాగిర్‌, పిర్జాదీగూడ, బోడుప్పల్‌, జవహర్‌ నగర్‌, మీర్‌పేట్‌ జిల్లెల గూడ, నిజాం పేట పరిధిలో సాధ్యమైనంత ఎక్కువ డివిజన్లలో పోటీ చేసి క్యాడర్‌ను విస్తరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఎమ్‌ఐఎమ్ పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు చేపడుతోంది. పార్టీ కార్యాలయం దారుస్సలాంతో పాటు మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లలో బహిరంగ సభలను నిర్వహించింది. ఈ సభలకు యునైటెడ్‌ ముస్లిం యాక్షన్‌ కమిటీతో పాటు మిత్రపక్షం టీఆర్‌ఎస్‌ కూడా పాల్గొంది. అటు బీహార్‌లోని కిషన్‌గంజ్‌లో ఎమ్‌ఐఎమ్‌ నిరసన సభ నిర్వహించింది. వరంగల్‌లోనూ మరో సభకు పార్టీ సిద్ధపడుతోంది.  ఈ నిరసన కార్యక్రమాలు మున్సిపల్‌ ఎన్నికల్లో మరిన్ని ఓట్లు రాలుస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అధికార పక్షం కూడా రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీ చేపట్టేది లేదని స్పష్టం  చేయటం ద్వారా ముస్లిం మైనార్టీ వర్గాల్లో టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ల పట్ల సానుకూల దృక్పథం ఏర్పడే అవకాశాలున్నాయి. ఇని ఎన్నికల్లో ఇరు పార్టీలకు ప్రయోజనం కలుగుతాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: