సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగ‌దారుల‌కు షాకింగ్ న్యూస్ ఇది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన విండోస్ ఆపరేటింగ్ సిస్ట‌మ్‌లో ఉన్న బ‌గ్స్ (లోపాలు) ను ఆస‌రాగా చేసుకుని వన్నాక్రై అనే ర్యాన్స‌మ్‌వేర్ ఎలా దాడి చేసిందో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల ఎంతో న‌ష్టం సంభవించింది. ఎన్నో కంప్యూట‌ర్లు ఈ వైర‌స్ కార‌ణంగా లాక్ అయ్యాయి. దీంతో ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ అప్‌డేట్ల‌ను మైక్రోసాఫ్ట్ విడుద‌ల చేసింది. అయితే, ఇక‌నుంచి అలాంటి చాన్స్ ఉండ‌దు. ఎందుకంటే...సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ తన విండోస్‌ 7 ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు సపోర్ట్‌ను నిలిపివేయనుంది. 

 

2009 అక్టోబర్‌ 22న విండోస్‌ 7 విడుదల అయింది. అప్ప‌టి నుంచి వివిధ సంద‌ర్భాల్లో అప్‌డేట్లు విడుద‌ల చేస్తోంది. అయితే,  వినియోగదారుల కంప్యూటర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ ఓఎస్‌కు సపోర్ట్‌ను నిలిపివేస్తున్నామని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. జనవరి 14వ తేదీ నుంచి ఆ ఓఎస్‌కు సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు ఒక పోస్టులో తెలిపింది. దీంతో విండోస్‌ 7 ఓఎస్‌కు ఇకపై ఎలాంటి అప్‌డేట్లూ రావని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. ఇప్పటికే విండోస్‌ 7 జెన్యూన్‌ ఓఎస్‌ను వాడుతున్న వారు ఉచితంగా విండోస్‌ 10కు ఆ ఓఎస్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చని సూచించింది. ఇక విండోస్‌ 7 పైరేటెడ్‌ వెర్షన్‌ను వాడుతున్న వారు కొత్తగా విండోస్‌ 10 ఓఎస్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. 

 


ఇదిలాఉండ‌గా, కొద్దికాలం క్రితం సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ తన విండోస్ 10 పీసీ యూజర్ల కోసం ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై యూజర్లు తమ పీసీని, ఆండ్రాయిడ్ ఫోన్‌ను కనెక్ట్ చేసుకుని నేరుగా పీసీ నుంచే కాల్స్ చేసుకోవచ్చు, స్వీకరించవచ్చు. అలాగే ఫోన్‌కు వచ్చే ఎస్‌ఎంఎస్‌లను కూడా పీసీలోనే చూసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే విండోస్ 10 యూజర్లు తమ పీసీలో మైక్రోసాఫ్ట్ అందించే యువర్ ఫోన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అందుకుగాను విండోస్ 10 ఏప్రిల్ 2018 ఆ తరువాత వచ్చిన ఓఎస్ అప్‌డేట్‌ను యూజర్లు తమ పీసీలో ఇన్‌స్టాల్ చేసుకుని ఉండాలి. ఇక ఆండ్రాయిడ్ ఫోన్‌లో యువర్ ఫోన్ కంపానియన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అందుకుగాను ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఓఎస్ ఆండ్రాయిడ్ 7.0 ఆపైన వెర్షన్ ఉండాలి. ఇక రెండు డివైస్‌లలోనూ ఆ యాప్‌లలో యూజర్లు తమ మైక్రోసాఫ్ట్ అకౌంట్‌తో లాగిన్ అయి అనంతరం ఫోన్‌ను ఓటీపీతో వెరిఫై చేసుకోవాలి. దీంతో ఫోన్, పీసీకి సింక్ అవుతుంది. ఇక ఆ తరువాత పీసీపై వర్క్ చేస్తున్నప్పుడు ఫోన్ కాల్స్ వస్తే ఫోన్ కోసం వెదుక్కోవాల్సిన పనిలేకుండా నేరుగా ఆ కాల్స్‌ను పీసీ నుంచే స్వీకరించవచ్చు. అలాగే ఫోన్‌తో సంబంధం లేకుండా పీసీలోని ఆ యాప్ నుంచే నేరుగా ఎవరికైనా కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: