నూతన సంవత్సరం అంటూ ఎదురు చూసిన వారికి. కొత్త సంవత్సరం వచ్చింది. ఈ కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకుని కొందరు ముందుకు వెళ్లుతుండగా. ఇదే కొత్త సంవత్సరం ఓ కొత్త రికార్డ్ నెలకొల్పింది. ఎందులో అంటారా. మన మద్యం బాబులే ఇందుకు కారణం. అవును మద్యం అమ్మకాలు రికార్డ్ స్దాయిలో జరిగాయట.

 

 

ఆదాయం లేదని బాధ పడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అండగా తాగుబోతులున్నారని నిరూపించారు. దీనికి అనుగుణంగానే ఎన్నికోట్ల మద్యం ఒక్క నూతన సంవత్సరంలో కడుపులోకి దిగిందో తెలుస్తే ఆశ్చర్య పోతారు. లిక్కర్‌ రాయుళ్లు డిసెంబర్‌ 30, 31 తేదీల్లో నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ అక్షరాల రూ.400 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని తాగిపారేశారు. గత ఏడాది డిసెంబర్‌ చివరి వారమంతా కలిసి రూ.600 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరగ్గా, చివరి రెండు రోజుల్లోనే రూ.400 కోట్ల విలువైన లిక్కర్‌ అమ్ముడుపోయిందని అంచనా.

 

 

ఇకపోతే కొత్త సంవత్సరం సందర్భంగా చివరి రెండు రోజులు కలిపి ఆరున్నర రెట్లు మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్‌ అధికారులు చెపుతున్నారు. ఒక జీహెచ్‌ఎంసీ పరిధిలోనే రూ.100 కోట్లకు పైగా విక్రయాలు జరగడం చెప్పుకోదగ్గ విశేషం.. ఇక బీర్లు, లిక్కర్‌ వారీగా చూస్తే ఈ 2 రోజుల్లో దాదాపు 4.5 లక్షల కేసుల బీర్లు, 5.10 లక్షల కేసుల లిక్కర్‌ అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి లిక్కర్‌ అమ్మకాలు భారీగా పెరగడం గమనార్హం.

 

 

అయితే రాష్ట్రంలో రోజుకు సగటున రూ.62 కోట్ల వరకు మద్యం వ్యాపారం జరుగుతుండగా, ఈ రెండు రోజుల్లోనే అందుకు నాలుగు రేట్లు మద్యం వ్యాపారం జోరు అందుకుంది. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగుతుందని తెలుస్తుంది. ఇకపోతే తాగి వాహనాలు నడపవద్దని పోలీసులు చేసిన హెచ్చరికలు చాలా మంది ఉల్లంగించారు. పెద్దమొత్తంలో మందుబాలు పోలీసుల చేతికి చిక్కారు..

మరింత సమాచారం తెలుసుకోండి: