మ‌హిళ‌లు, చిన్నారులు పై జ‌రిగే అఘాయిత్యాలు రోజు రోజుకూ ఎక్కువ‌వుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చినా కూడా మృగాళ్ళ ఆగ‌డాలు మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. గ‌తంలో ఢిల్లీ నిర్భ‌య విష‌యంలో జ‌రిగిన‌ప్పుడు కొత్త‌గా నిర్భ‌య చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చింది అప్ప‌టి ప్ర‌భుత్వం. కానీ పెద్ద‌గా ఎక్క‌డా క్రైమ్ రేటు త‌గ్గిన‌ట్లు క‌నిపించ‌లేదు. ఇటీవ‌లె జ‌రిగిన దిశ ఘ‌ట‌న పై కూడా ఏపీ ప్ర‌భుత్వం ఇప్పుడు కొత్త చ‌ట్టాన్ని తీసుకువ‌స్తుంది. ఇలా ప్ర‌భుత్వాలు కొత్త చ‌ట్టాలు తీసుకురావ‌డం త‌ప్ప మ‌నుషుల్లో మాత్రం మార్పు క‌నిపించ‌డం లేదు. మ‌నిషి మాన‌వ విలువ‌ల్ని కోల్పోయి మృగంలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. బంధాలు, సంబంధాల‌ను మ‌ర్చిపోయి ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. క్రైమ్ రేట్ త‌గ్గించ‌డం కోసం ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వాలు తీసుకునే నిర్ణ‌యాలు కూడా మంచిగానే ఉంటున్నాయి. 

 

ఇక‌పోతే ఈ కొత్తగా తీసుకువ‌చ్చే దిశ చ‌ట్టం ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం, నిందితులకు శిక్షలు అమలవుతాయి. ఈ చట్టాన్ని ఇతర రాష్ట్రాలు కూడా తీసుకురావడానికి ముందుకు వచ్చాయి. చట్టం అమలులో అందరికీ ఆదర్శంగా ఉండేందుకు ఏపీ సర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
అందులో భాగంగా దిశ చట్టం అమలు కోసం 87 కోట్ల రూపాయలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జీవో జారీ చేశారు. మహిళలు, బాలలపై లైంగిక నేరాల సత్వర విచారణకు వీలుగా నిధులు మంజూరు చేశారు.

 


ఇక ఈ నిధులు ఎలాంటి వాటికి వాడ‌తారంటే...ఈ చట్టం అమలుకోసం ఎలాంటి ఆర్థికపరమయిన ఇబ్బందులు తలెత్తకుండా నిధులు విడుదల చేసింది. ఈ నిధులను రాష్ట్రంలో మహిళా పోలీసు స్టేషన్లలో సౌకర్యాల కల్పన, ఫోరెన్సిక్‌ ప్రయోగశాలల బలోపేతం... ప్రతి జిల్లాలో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు, దిశ కాల్‌సెంటర్‌, యాప్‌ల కోసం వీటిని వినియోగించనున్నారు. దిశ చట్టం కింద నమోదయిన కేసులు సత్వరం విచారించేందుకు విశాఖపట్నం, తిరుపతి ఫోరెన్సిక్‌ ప్రయోగశాలల్లో డీఎన్‌ఏ, సైబర్‌ విభాగాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ప్రయోగశాలలోని డీఎన్ఏ , సైబర్ విభాగాల్ని మరింత పటిష్ఠం చేస్తారు. డయల్‌ 100, 112లకు సంబంధించి ఒకే కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసి దాన్ని దిశ కంట్రోల్‌ రూంగా పిలవనున్నారు. 

 

దిశ యాప్‌ కోసం కోటి 26 లక్షల రూపాయలను వినియోగిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రతి బస్‌స్టాప్‌ సెంటర్‌కు ఒక మహిళా ఎస్సై పోస్టు మంజూరు చేశారు. దీని ద్వారా వేధింపులకు పాల్పడేవారికి అడ్డుకట్ట వేస్తారు. ప్రత్యేక కేసుల విచారణ సందర్భంగా అదనపు విధులు నిర్వర్తించే మహిళా పోలీసుస్టేషన్‌ సిబ్బందికి 30 శాతం ప్రత్యేక భత్యం చెల్లించనున్నారు. అలాగే కేసుల సత్వర విచారణకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని నిర్ణయించారు. 

 


దిశ చట్టం అమలు పై ఏపీ సీఎం జగన్‌ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. అధికారులకు అవసరమయిన ఆదేశాలు జారీచేస్తున్నారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాన్ని కఠినంగా అమలుచేయాలని జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక మ‌రి వీట‌న్నిటి ద్వారా అయినా కాస్త దేశంలో జ‌రిగే మ‌హిళ‌ల పై అఘాయిత్యాలు త‌గ్గుతాయేమో చూడాలి మ‌రి. ఈ విధంగా టెక్నిక‌ల్‌గా అందుబాటులో ఉండే ఇన్ని సౌక‌ర్యాలు క‌ల్పించే ప్రభుత్వ ప‌ని తీరును చాలా మంది ప్ర‌జా సంఘాలు మెచ్చుకుంటున్నాయ‌నే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: