తెలంగాణ రాష్ట్రంలోని 120 మున్సిపాల్టీలు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొన‌సాగుతోంది. డిసెంబర్‌ 23న రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా నోటిఫికేషన్‌ ఇచ్చిందని, ఎన్నిక‌ల విష‌యంలో కీల‌క‌మైన‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారుచేయకుండా నోటిఫికేషన్‌ ఇవ్వడం అక్రమమని పేర్కొంటూ  పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ మున్సిపల్‌ చట్టం- 2019 సెక్షన్‌ 6, 7 ప్రకారం వార్డులవారీ రిజర్వేషన్లు ప్రకటించకుండా నోటిఫికేషన్‌ ఇచ్చారని పేర్కొంటూ దాఖ‌లైన ఈ పిటిష‌న్‌పై విచార‌ణ‌ను నేడు చేప‌ట్టిన హైకోర్టు జనవరి 6 కు వాయిదా వేసింది.

 

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా, రాష్ట్రంలోని 120 మున్సిపాల్టీల్లో 2,727 వార్డులు, 10 కార్పొరేషన్లలో 385 వార్డులకు సంబంధించి రిజర్వేషన్లు ప్రకటించాల్సిన అంశం పెండింగ్‌లో పెట్టి  డిసెంబర్‌ 17న వార్డుల విభజన తుది నోటిఫికేషన్‌ ఇచ్చారని, తెలంగాణ మున్సిపల్‌ చట్టం- 2019 సెక్షన్‌ 6, 7 ప్రకారం వార్డులవారీ రిజర్వేషన్లు ప్రకటించకుండా నోటిఫికేషన్ ఇవ్వ‌డం అభ్యంత‌ర‌క‌ర‌మ‌ని పేర్కొంటూ పీసీసీ చీఫ్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ప్రస్తుతం ప్రకటించిన ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తే రిజర్వుడు వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేయడం కష్టంగా మారుతుందని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వాదన‌ల్లో పేర్కొన్నారు. ప్ర‌స్తుత నోటిఫికేషన్‌ను పక్కనపెట్టి.., రీషెడ్యూల్‌ ప్రకటించేలా ఆదేశాలు జారీచేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ గురువారం విచారణకు వచ్చింది. పిటీషనర్ తరపు న్యాయవాది దామోదర్ రెడ్డి తాము దాఖ‌లు చేసిన పిటిషన్‌పై వాదనలు వినిపించడానికి సమయం కోరారు. త‌మ త‌ర‌ఫున దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తార‌ని పేర్కొన్నారు. దీంతో, జనవరి 6 తేదీన విచార‌ణను హైకోర్టు వాయిదా వేసింది.

 

ఇదిలాఉండ‌గా,  కార్పొరేషన్లు, మున్సిపాల్టీల మేయర్లు, చైర్‌ పర్సన్ల రిజర్వేషన్ల ఖరారుకు ప్రక్రియకు సంబంధించి అధికారులు శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావడంతో పాత, కొత్త కార్పొరేషన్లు, మున్సిపాల్టీల జనాభా వివరాలను అధికారులు క్రోడీకరిస్తున్నారు. ఇక మిగిలిన బీసీ రిజర్వేషన్ల కోసం ఓటర్లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నందున తాజాగా జరుగుతున్న ఓటర్ల చేరికలు, తొలగింపులు కీలకంగా మారనున్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో త్వ‌ర‌లోనే ఓ క్లారిటీ రానుంద‌ని స‌మాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: