కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ నేత జ‌గ్గారెడ్డి మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో జ‌గ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఇటు ముఖ్య‌మంత్రి కేసీఆర్ అటు ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్‌, రాష్ట్ర మంత్రుల‌పై మండిప‌డ్డారు. పుర‌పాల‌క ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేస్తోంద‌ని ఆరోపించారు. ప్రతి ఎన్నికకు డబ్బు-పోలీస్- ప్రభుత్వ అధికారులను కేసీఆర్ విరివిగా వాడుతున్నాడ‌ని జ‌గ్గారెడ్డి విమ‌ర్శించారు. టీఆర్ఎస్ ఎన్నికల్లో డబ్బులు,మద్యం పంపిణీ చేస్తుంటే .. వారికి పోలీసులు భద్రత కల్పిస్తున్నారని ఆరోపించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంత అధికార దుర్వినియోగం ఎప్పుడూ చేయలేదని తెలిపారు.

 


ప్రతిపక్ష పార్టీ నాయకులను కేసులతో ఇబ్బందులు పెడుతూ బ‌ల‌హీనం చేసే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందని జ‌గ్గారెడ్డి మండిప‌డ్డారు. ``మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ ఖరారుకు మ‌రియు నోటిఫికేషన్‌కు మ‌ధ్య‌ కనీసం వారం పది రోజులు వ్యవధి ఉండాలి. కానీ ఈ ద‌ఫా అలాంటిదేమీ లేదు. ఎన్నికల అధికారి నాగిరెడ్డి టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయాడు. ఐఏఎస్ అధికారులు అధికార పార్టీకి ఊడిగం చేయడం మానుకోవాలి. అధికారులను అడ్డుపెట్టుకొని టీఆర్ఎస్ సర్కార్ ప్రతిపక్షాలను ఎన్నికల్లో ఇబ్బందులు పెట్టె ప్రయత్నం చేస్తోంది. అందుకే ప్రతిపక్షాలు కోర్టులను ఆశ్రయిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో ఎంత అభివృద్ధి చేశారో టీఆర్ఎస్ సర్కార్ చెప్పగలదా? రాష్ట్రంలో ఎన్నికల అధికారులను, పోలీసులను, ఎక్సైజ్ అధికారులను అడ్డుపెట్టుకొని డబ్బుతో అన్ని మున్సిపాలిటీలను గెలుచుకోవాలని చూస్తోంది` అని ఆరోపించారు.

 

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీపై తెలంగాణ‌ మంత్రి దయాకర్ రావు విమర్శలు చేయడం సరికాదని జ‌గ్గారెడ్డి అన్నారు. ``ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు... నువ్వు కేటీఆర్‌ను పొగుడుకో ... భజన చేసుకో...తప్పులేదు కానీ కేటీఆర్ దగ్గర చెంచాగిరి చెయ్యకు. టీడీపీలో ఉండగా కేసీఆర్ కుటుంబాన్ని తిట్టని తిట్లు తిట్టిన చరిత్ర ఎర్రబెల్లి దయాకర్ రావుది. మంత్రి పదవి శాశ్వతం కాదు అనేది దయాకర్ రావు గుర్తించుకోవాలి. రాహుల్ స్థాయి ఎక్కడ కేటీఆర్ ఎక్కడ?కేటీఆర్‌ను రాహుల్ తో ఎర్రబెల్లి  పోల్చడం సరికాదు. ప్రధాని పదవి వద్దని త్యాగం చేసిన వ్యక్తి రాహుల్ .. ఆయనతో కేటీఆర్ ను ఎలా పోల్చుతారు? మంత్రులు రాహుల్ గాంధీ గురించి చిల్లర విమర్శలు చేయవద్దు .. మానుకోక పోతే మేము కూడా అదే అతరహలో ప్రతి విమర్శలు చేస్తాం` అని హెచ్చ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: