అమరావతి రాజధాని రైతుల నిరసనలు 17వ రోజుకు చేరాయి. ఆందోళనలు మరింత ఉధృతం చేసేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. ఇప్పటికే ధర్నాలు, ర్యాలీలు, రిలే దీక్షలు, వినూత్న నిరసనలతో వేడి పుట్టించారు. రాష్ట్రపతి, ప్రధానులకు లేఖలు కూడా రాశారు. నేటి నుంచి సకల జనుల సమ్మెకు పూనుకున్నారు. 

 

మలిదశ ఉద్యమాని దిశగా అడుగులు వేశారు రాజధాని ప్రాంత రైతులు. ఈ రోజు నుంచి సకల జనుల సమ్మె చేస్తున్నారు. ఆస్పత్రులు, మెడికల్ షాపులు, పాల సరఫరా తప్ప మిగతా కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించారు. 16 రోజులుగా ఉద్యమిస్తున్నా  ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. రాజధాని అన్ని గ్రామాల్లో ఆందోళనకు సన్నహాలు చేస్తున్నారు. 

 

మరోవైపు అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ తాజాగా, రాజధాని ప్రాంతానికి చెందిన పలువురు మహిళలు... రాష్ట్రపతికి లేఖలు రాశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని.. లేదంటే కారుణ్య మరణాలకు అనుమతినివ్వాలని లేఖలో కోరారు.  మందడం మహాధర్నాలో రైతులు మూకుమ్మడిగా రాష్ట్రపతికి లేఖలు రాశారు.  

 

అటు తుళ్లూరు, మందడంలో రాజధాని రైతులు, మహిళలు వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. రాజధాని తరలింపును దేవుడే అడ్డుకోవాలంటూ గోవిందనామాలు, లలితా సహస్ర నామాలు పారాయణం చేశారు. ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులకు సంఘీభావంగా.. గురువారం మంగళగిరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. టీడీపీ, సీపీఎం నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజధాని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

 

ఇంకా పలు గ్రామల్లో ప్రధాన రహదారులపై టెంట్లు వేసి తమ నిరసనలను  చేపట్టారు రైతులు. నడిరోడ్డుపై వంటావార్పులు చేసి, అక్కడే తమ నిరసనలను తెలుపుతున్నారు . ఇక తుళ్ళూరు, మందడంలో మహాధర్నాలు, వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: