గుంటూరులో మళ్లీ కాల్ నాగులు బుసలు కొట్టారు. చాటుమాటున వడ్డీ వ్యాపారం నడుపుతూ,  డబ్బు అవసరం కోసం వచ్చిన వారి ప్రాణాలను తోడేస్తున్నారు. సమయానికి డబ్బు చెల్లించని వారి వీక్‌ నెస్‌ను ఆసరా చేసుకొని వేధింపులకు దిగుతున్నారు. వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తూ పేదల ప్రాణాలను బలిగొంటున్నారు. పక్క వారి అవసరాలను ఆసరాగా చేసుకొని రెచ్చిపోతున్న ఫైనాన్షియర్లపై...పోలీసులు రౌడీ షీట్ తెరిచారు.  

 

కేపిటల్ ఏరియాలో కాల్ నాగులు బుసలు కొడుతున్నాయి. గుంటూరులో కాల్ మనీ వ్యాపారుల వేధింపులు ఎక్కువయ్యాయి. అవసరం కోసం డబ్బు తీసుకున్న వారి వీక్ నెస్‌ ను అడ్డుపెట్టుకొని, ఫైనాన్షియర్లు వేధింపులకు దిగుతున్నారు. దీంతో కొందరి జీవితాలు అర్థాంతరంగా ముగుస్తున్నాయి. ఇటీవల ఓ యువకుడు ఏకంగా పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. ఆ ఘటన మరువకముందే మరో బాధిత కుటుంబం ఓ యువకుడు బలైపోయాడు. 

 

కాజా గ్రామంలో  కాల్ మనీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక దంపతులు ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చిన ఫైనాన్షియర్లు, సమయానికి తీర్చలేకపోవడంతో ఇల్లాలిని వ్యభిచారానికి పంపాలని కుటుంబసభ్యులపై ఒత్తిడి తీసుకువచ్చారు. అవమానభారంతో దంపతులిద్దరూ సూసైడ్ చేసుకున్నారు. ఎంత మనోవేధనకు గురయ్యామో చెబుతూ భార్యాభర్తలిద్దరరూ సూసైడ్‌ నోట్‌లో రాసి బలవన్మరణం చేసుకున్నారు. 

 

విజయవాడలో మరో యువకుడు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ్,  సెల్ఫీ వీడియోలో వెలుగు చూసిన వాస్తవాలతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. గతంలో కూడా తాడేపల్లి పోలీసు స్టేషన్ వద్ద యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు.

 

రాజధాని ప్రాంతలో వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలు కలకలం రేపుతున్నాయి. కాల్ మనీ, అధిక వడ్డీలతో పాటుగా మీటర్ వడ్డీలను నడుపుతున్న గ్యాంగ్ బండారాన్ని పోలీసులు బయటపెట్టారు. లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని హజారివారివీధిలో... పేదలు, చిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకుని.... అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తున్న కల్యాణ్ చక్రవర్తి, అతడి అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వడ్డీ వ్యాపారి బెదిరింపులకు తాళలేక బాధితుడు స్పందనలో ఫిర్యాదు చేయడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. నిందితుల వద్ద నుంచి 30లక్షలకు పైగా నగదు, 9 ఖాళీ ప్రాంసరీ నోట్లు, 10 ఖాళీ చెక్కులు, వడ్డీ లెక్కల పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీట్ తెరిచారు పోలీసులు. 

 

పేద పేదల జీవితాలను కాటేస్తున్న కాల్ నాగుల భరతం పట్టాలని బాధిత కుటుంబాలు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే మరికొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: