వాళ్లు నలుగురు యువకులు. ఇప్పుడిప్పుడే టీనేజ్ దాటిన వారు. ఇంజినీరింగ్‌, డిగ్రీ చదువుతున్నారు. అయితే, ఈ వయ‌సులోనే డ్రగ్స్‌కు బానిస అయిపోయారు. త‌మ ఆగ‌డాల‌కు అడ్డు వ‌స్తున్నాడ‌ని ఎస్సైని చంపేయ‌బోయారు. వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలో ఈ దారుణం చోటుచేసుకుంది. వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం... నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లాలో బుధవారం రాత్రి ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని టోలిచౌకికి చెందిన ఇమ్రాన్‌ అలీ, అన్వర్‌, నవీద్‌, సమీర్‌ కారు లో గురువారం తెల్లవారుజామున జిల్లాలోని కోట్‌పల్లికి బయలుదేరారు.

అయితే, కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల శాంతిభ‌ద్ర‌త‌ల్లో భాగంగా  అనంతగిరిలోని నంది విగ్రహం సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టడాన్ని కారులో వస్తున్న నలుగురు యువకులు గుర్తించారు. అప్పటికే పోలీసులు ఉన్నచోటికి వచ్చేశారు. కారును ఆపాల్సిందిగా నవాబుపేట ఎస్సై కృష్ణ సైగ చేశారు. తనిఖీ తప్పించుకునేందుకు కారు డ్రైవింగ్‌ చేస్తున్న ఇమ్రాన్‌ లైట్లు ఆపేసి రివర్స్‌ తీసేందుకు వేగంగా వెనుకకు తిప్పాడు. ఈ క్రమంలో ఎస్సై కృష్ణను గట్టిగా ఢీకొట్టారు. దీంతో ఎస్సై ఎడమకాలు విరగడంతో పాటు తలకు తీవ్రగాయాలయ్యాయి. భయంతో నలుగురు యువకులు కారు దిగి పారిపోయేందుకు ప్రయత్నించారు. తనిఖీ చేస్తున్న మిగతా సిబ్బంది వారిని వెంబడించి అదుపులోకి తీసుకొన్నారు. 

అనంత‌రం కారును తనిఖీ చేసి 250 గ్రాముల గంజాయి సిగరెట్లను స్వాధీనం చేసుకొన్నారు. నలుగురు యువకులు ఇంజినీరింగ్‌, డిగ్రీ చదువుతున్నారని ఎస్పీ తెలిపారు. నలుగురిపై కేసు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సైని హైదరాబాద్‌లోని కిమ్స్‌ దవాఖానలో చేర్పించారు. వాహన తనిఖీలను తప్పించుకోబోయి కారుతో ఎస్సైని ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచిన ఘటన‌పై  డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా, ప్రమాదాలకు గురైనా, వ్యక్తిగతంగా నష్టం జరిగినా మొక్కవోని ధైర్యంతో ప్రజలకు సేవలందిస్తున్న పోలీసులను అభినందించారు. ఈ మేర‌కు ఆయ‌నో  ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: