అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న అనవసర గందరగోళం పై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు ఇన్సైడ్ ట్రేడింగ్ ను తాను వెలుగులోకి తీసుకొస్తున్న కారణంగానే టీడీపీ నేతలు తనపై అనవసర, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నీరు కొండ గ్రామంలో తనకు ఐదెకరాల భూమి ఉన్నట్టు టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారని, దానిని కనుక నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. రాజధాని ప్రాంతంలో తనకు భూములు ఉన్నట్టు నిరూపిస్తే ఆ భూములను వారికి ఇచ్చేస్తానంటూ ఆయన చెప్పారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అలా చేయలేక పోతే తనపై ఆరోపణలు చేసిన బోండా ఉమా తదితరులు తప్పు జరిగిందని ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.


 తెలుగుదేశం ప్రభుత్వంలో రాజధాని అమరావతిలో ఏ పని చేయలేదని రైతులను, ప్రజలను దోచుకోవడం తప్ప అంటూ రామకృష్ణ రెడ్డి చంద్రబాబును ఉద్దేశించి విమర్శించారు. ఈ విషయం జనాలకు బాగా అర్థమైంది కాబట్టే తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని ఓడించారని చెప్పారు. సాక్షాత్తు మూడు శాఖల మంత్రి, ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న నీ కుమారుడు లోకేష్ పోలీసులను వాడుకుని మంగళగిరిలో తన ఓటమికి పని చేయ లేదా అని అని వాళ్ల ప్రశ్నించారు. అయినా లోకేష్ ను అక్కడి ప్రజలు చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అన్యాయం, అక్రమాల కారణంగానే ప్రజలంతా తమను గెలిపించారని ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సూచించారు.

 

 అప్పట్లో రైతులు, ప్రజలకు వ్యతిరేకంగా టీడీపీ పనిచేసింది కాబట్టే కదా టిడిపికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. రాజధానిలో అన్యాయంగా వ్యవహరించి పోలీసులను అడ్డం పెట్టుకుని అప్పటి మంత్రులు తమపై తప్పుడు కేసులు నమోదు చేయించి ఇబ్బందులు పెట్టలేదా అని ప్రశ్నించారు. అనేక అక్రమాలు అన్యాయాలు చేసిన చంద్రబాబు కులాల పేరుతో, సామాజిక వర్గాల పేరుతో అన్యాయం జరుగుతుంది అంటూ ఇప్పుడు నెత్తీ నోరూ బాదుకుంటున్నాడని  విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ కోసం రాజధాని రైతులు కొంతమంది అప్పటి టిడిపి ప్రభుత్వానికి భూమి ఇచ్చారని, వారికి  న్యాయం జరిగిందా లేదా అనే విషయాన్ని చంద్రబాబు చెప్పాలని అని డిమాండ్ చేశారు. అమరావతికి చంద్రబాబు శాపం అయితే జగన్ వరం అని ఆళ్ల చెప్పారు.  


వారికి అప్పట్లో ప్లాట్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇచ్చాడాఅని సూటిగా ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో ఒక్క శాశ్వత బిల్డింగ్ కూడా కట్టలేదని, అప్పట్లో నిన్ను నమ్ముకున్న పది, ఇరవై శాతం మంది ప్రజలకు కూడా నువ్వు న్యాయం చేయలేకపోయవని మండిపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: