రాజధాని పోరాటంలో కొత్త చర్చ మొదలైంది. అమరావతి నిరసనల్లో భువనేశ్వరి పాల్గొనడం ఆసక్తిగా మారింది. హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్ట్ తప్ప ఇతర కార్యక్రమాలు పట్టని చంద్రబాబు సతీమణి ఇప్పుడెందుకు రోడ్డెక్కారు. ఎన్టీఆర్ కుమారుడు కూడా ఎందుకు కలిసి వచ్చారు. బాధితుల్లో మంగళగిరి నియోజకవర్గం గ్రామాలు ఉండటం కారణమా...? మహిళల వేదన వల్ల తీసుకున్న నిర్ణయమా ?   

 

రాజధాని గ్రామాల్లో నారా భువనేశ్వరి పర్యటించారు. నూతన సంవత్సర తొలి రోజు వేడుకలకు దూరంగా ఉన్న చంద్రబాబు సతీమణి....రైతులకు మద్దతు పలికారు. ముఖ్యంగా మహిళా రైతులు రోడ్డెక్కి చేస్తున్న నిరసనలకు అండగా ఉంటానని ప్రకటన చేశారు. సాధారణంగా భువనేశ్వరి రాజకీయ వేదికలకు, ప్రజా ఉద్యమాలకు దూరంగా ఉంటారు. హెరిటేజ్ వ్యాపార వ్యవహరాలు, ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాల వరకే ఆమె కనిపిస్తారు.  టీడీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో కూడా ఆమె ఎక్కడా కనిపించలేదు. ఒక్క రాజధాని శంకుస్థాపనలో మాత్రం కటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అలాంటి భువనేశ్వరి ఇప్పుడు నిరసన దీక్షలో కూర్చున్నారు. రాజధాని పోరాటంలో రైతులకు అండగా ఉంటాని చెప్పి తన చేతి గాజును కూడా ఉద్యమం కోసం విరాళంగా ఇచ్చారు. మహిళల పోరాటం చూసి చలించిపోయే తాను వారి వద్దకు వచ్చినట్లు తెలిపారు. 

 

ఎన్నడూ లేని విధంగా భువనేశ్వరి రోడ్డెక్కడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు, మహిళలు బాధితులు కావడంతో...ఆ వర్గాలకు అండగా ఉండేందుకు ఆమె స్వయంగా వచ్చిందని తెలుస్తోంది. మరోవైపు రాజధాని మార్పు జరిగితే నష్టపోయే గ్రామాల్లో మంగళగిరి నియోజకవర్గ గ్రామాలు కూడా ఉన్నాయి. ఎర్రబాలెం, క్రిష్ణాయ పాలెం గ్రామాలు మంగళగిరి నియోజకవర్గంలోకి వస్తాయి. మొన్నటి ఎన్నికల్లో నారా లోకేష్ ఈ నియోజకవర్గంనుంచే పోటీ చేశారు. బాధిత గ్రామాల్లో కొడుకు పోటీ చేసిన నియోజకవర్గం కూడా ఉండటంతో భువనేశ్వరి నిరసనలకు వచ్చారనే చర్చ జరుగుతోంది. రాజధాని రైతులకు అండగా ఉండటం ఒక ఎత్తు అయితే.. లోకేష్‌ నియోజవర్గంలోని ప్రజలకు భరోసా ఇచ్చేలా భువనేశ్వరి పర్యటన డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.   

 

ఇదిలా ఉంటే భువనేశ్వరితో పాటు ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు కూడా రాజధాని గ్రామాల్లో నిరసనల్లో పాల్గొన్నారు. గతంలో వీరు పార్టీ కార్యక్రమాల్లో గానీ, ఇతర వ్యవహారాల్లో గానీ జోక్యం చేసుకోలేదు. అయితే రాజధాని అంశంలోని తీవ్రత దృష్ట్యా నారా- నందమూరి కుటుంబాల మద్దతు వారికి ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేశారు. రాజధాని అంశంలో తొలిసారి ప్రజా ఉద్యమంలో పాల్గొన్న భువనేశ్వరి తదుపరి ఎలా వ్యవహరిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది.  మరి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా రాజధానికి మద్దతు పలుకుతారో లేదో చూడాలి.  మొత్తంగా చూసుకుంటే నారా- నందమూరి కుటుంబాలు మీ వెంటనే అంటూ రాజధాని వాసులకు మద్దతు పలుకుతున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: