ప్రముఖ లైఫ్ స్టైల్ బ్రాండ్ అయిన షాపర్స్ స్టాప్ సిరిసిల్లలో తన యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈరోజు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు సమక్షంలో ముంబైలో జరిగిన సమావేశంలో ఈ మేరకు షాపర్స్ స్టాప్ సంస్థ, తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం( యంవోయూ) కుదుర్చుకున్నది.  తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి మరియు షాపర్స్ స్టాప్  సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారి రాజీవ్ సూరి, ఈరోజు మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందాలు పత్రాలను మార్చుకున్నారు.

 

సిరిసిల్ల పట్టణంలో ఉన్న వస్త్ర పరిశ్రమ అనుకూల అవకాశాలను పరిశీలించిన తర్వతా అక్కడే తమ యూనిట్‌ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు షాపర్స్ స్టాప్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం అక్కడ ఉన్న మానవ వనరులు, టెక్స్ టైల్ పార్క్, అప్పారల్ పార్కు వంటి మౌలిక వసతులు,  వస్త్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారం వంటి పలు అంశాలను తమను పెట్టుబడి పెట్టేలా  ప్రభావితం చేశాయని షాపర్స్ స్టాప్ తెలిపింది. ఈరోజు కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా సిరిసిల్లలోని అప్పారెల్ పార్కులో తమ యూనిట్ను ఏర్పాటు చేస్తామని, త్వరలోనే పెట్టుబడికి సంబంధించిన పూర్తి వివరాలను సంస్థ తరఫున ప్రకటిస్తామని తెలిపింది. 

 

దేశంలోనే ప్రముఖమైన లైఫ్ స్టైల్ బ్రాండ్ షాపర్స్ స్టాప్ సిరిసిల్లా పట్టణానికి రావడం పట్ల పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి ద్వారా సిరిసిల్లలో  వందల మందికి ఉపాధి అవకాశాలతో లభించడంతోపాటు, ముఖ్యంగా స్థానిక మహిళలకు మంచి అవకాశాలు దొరుకుతాయన్నారు. షాపర్స్ స్టాప్ రాక సిరిసిల్ల అప్పారెల్  పార్క్ కు అభివృద్ధికి  ఏంతో దోహదం చేస్తుందన్న ఆశాభావాన్ని అయన వ్యక్తం చేశారు.

 

ముంబైలో పలువురు  టెక్స్టైల్ రంగ పారిశ్రామికవేత్తలతోనూ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ టెక్స్టైల్ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపిన మంత్రి కేటీఆర్, ఈ రంగంలో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వ విధానాలను వారికి వివరించారు.  ఈ సందర్భంగా వారికి తెలంగాణ రాష్ట్ర టెక్స్టైల్ పాలసీ తో పాటు, టీఎస్ ఐపాస్ వంటి పారిశ్రామిక విధానాలను వివరించారు. 

 

టెక్స్టైల్ రంగ పారిశ్రామికవేత్తలతో సమావేశానంతరం మంత్రి కేటీఆర్, ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఆలయన్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఫార్మా రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, ముఖ్యంగా ఫార్మాసిటీ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల గురించి వారికి వివరించారు.  ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ అపెక్స్ బాడీ సమావేశంలో ప్రసంగిచడం ద్వారా తెలంగాణ  రాష్ట్రం, అక్కడి ఉన్న పెట్టుబడుల అవకాశాల గురించి వివరించేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టం పరిమాణం (the size of our life Sciences ecosystem) 50 బిలియన్ డాలర్లుగా ఉన్నదని, దీన్ని రానున్న పది సంవత్సరాల్లో రెట్టింపు చేసి, వంద బిలియన్ డాలర్లకు పెంచాలన్న లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఈరంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి, సుమారు 4 లక్షల నూతన ఉపాధి అవకాశాలను కల్పించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి కేటీఆర్ తన  ప్రసంగంలో వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: