ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పెద్ద షాక్ ఇచ్చారు. రాజధాని అమరావతిని తరలింపు విషయంతో పాటు మూడు రాజధానుల ప్రతిపాదనపై కిషన్ స్పష్టమైన ప్రకటన చేయటం వెంకయ్యకు బాగా ఇబ్బందిగా మారిందని సమాచారం. జగన్ ప్రకటనను ముందు వెంకయ్య స్వాగతించారు. అయితే అదే రోజు సాయంత్రం మళ్ళీ ఖండించిన విషయం అందరికీ తెలిసిందే.

 

విచిత్రమేమిటంటే మరుసటి రోజు ఇదే విషయమై మాట్లాడుతూ అంతకుముందు చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా ఏదైతే చెబుతోందో అదే విషయాన్ని వెంకయ్య కూడా చెప్పారు. దాంతో సామాజికవర్గమంతా ఏకమైందనే భావనలు పెరిగిపోయింది. నిజానికి రాజధాని అంశంతో కేంద్రప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్న విషయం తెలిసిందే.

 

ఉపరాష్ట్రపతిగా వెంకయ్యకు అసలు వేలు పెట్టటానికి కూడా లేదు. అయినా కానీ లేని పెద్దరికాన్ని మీదేసుకుని ’మూడు రాజధానుల విషయంలో ఎవరికి చెప్పాలో వాళ్ళకు చెబుతా’ అంటూ జగన్ ను బెదిరించినట్లుగా మాట్లాడారు. సరే ఉడుత బెదిరింపులకు ఎవరైనా భయపడతారా ? అన్నది వేరే సంగతి. వెంకయ్య మాటలనే ఫిరాయింపు ఎంపి సుజనా చౌదరి లాంటి వాళ్ళు పదే పదే అరిగిపోయిన రికార్డులాగ తిరగేస్తున్నారు.

 

అయితే వీళ్ళందరికీ తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి షాకిచ్చారు. రాజధాని మార్పు, మూడు రాజధానుల అంశంతో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రప్రభుత్వానికి సంబంధించిది కాబట్టి బిజెపి నేతలెవరూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడద్దంటూ హెచ్చరికలు చేశారు. కిషన్ హెచ్చరికలు వెంకయ్యకు కూడా వర్తిస్తాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

 

నిజానికి రాష్ట్రం సమైక్యంగా ఉన్న రోజుల్లో వెంకయ్య-కిషన్ మొదటి నుండి వేర్వేరు గ్రూపుల్లోనే ఉండేవారు. వెంకయ్య  పార్టీలో బాగా యాక్టివ్ గా ఉన్నపుడు కిషన్ మాట పార్టీలో పెద్దగా చెల్లుబాటయ్యేది కాదు. అలాంటిది విభజన జరగటం, వెంకయ్య కూడా క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకోవటంతో కిషన్ కు అదృష్టం పట్టుకుంది. అదే సమయంలో ఇపుడు కేంద్రమంత్రిగా కూడా ఉండటంతో వెంకయ్య కు కిషన్ ఇపుడు షాకులిస్తున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: