తెలుగుదేశం పార్టీలో అతి తక్కువ కాలంలోనే మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకోవ‌డ‌మే కాకుండా...ఎప్పుడూ వార్తల్లో హాట్‌ టాపిక్‌గా కనిపించిన  టీడీపీ మాజీ అధికార ప్రతినిధి యామిని శర్మ త‌న రాజ‌కీయ జీవితంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తన వ్యక్తిగత, దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల కారణాలతో టీడీపీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఆమె ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరారు. కడప జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సమక్షంలో యామిని కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీలో యామిని చేరిక అనంత‌రం ఆమె పొలిటిక‌ల్ డైన‌మిజం గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

 

ఇదిలాఉండ‌గా, గతేడాది నవంబర్‌లో టీడీపీ అధికార ప్రతినిధి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి యామిని రాజీనామా చేశారు. తాజాగా కడప జిల్లా పర్యటనలో ఉన్న గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఆమెకు కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో యామిని బీజేపీలో చేరారు. ఆమె తోపాటు కడప జిల్లాలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు కూడా కొందరు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.

 

2016లో టీడీపీలో చేరిన యామిని.. ఆ తరువాత టీడీపీలోని అధికార ప్రతినిధుల్లో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో మీడియా డిబేట్లలో ఆమె పాల్గొంటూ టీడీపీపై ఈగ వాలనీయకుండా చేసేవారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నియమితురాలైన తర్వాత రెండు మూడు రోజులకు ఓ ప్రెస్ మీట్ పెట్టిన సాధినేని యామిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో ఆమె ‘పవన్ కళ్యాణ్ తాట తీస్తాం. నలిపేస్తాం అంటున్నారు. ఎవరి తాట తీస్తారు? ఏం నలిపేస్తారు? మీరు కూర్చుని మల్లెపూలు తప్ప ఇంక దేన్నీ నలపలేరు.’ అని వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద దుమారం రేగింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమె మీద భారీగా ట్రోల్స్ వచ్చాయి. ఆ తర్వాత ఓ సందర్భంలో ఆమె మల్లెపూలు పెట్టుకుని ఉన్న ఫొటోలు బయటకువచ్చాయి. దీంతో ఆమె మీద మల్లెపూల యామిని అనే ముద్ర సోషల్ మీడియా వేసింది. దీనిపై స్పందిస్తూ...తనను మల్లెపూల యామిని అని పిలిచేవారిని పిల్లల బురుద బూట్లతో కొట్టాలని సాధినేని యామిని అన్నారు. ఇదిలాఉండ‌గా, బీజేపీలో కూడా మునుప‌టి రీతిలోనే యామిని దూకుడుగా స్పందిస్తారా?  లేక‌పోతే సంయ‌మ‌నం పాటిస్తారా? అనే ఆస‌క్తి స‌హ‌జంగానే వ్య‌క్త‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: