విశాఖలో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సాగరతీరం వెంబడి భోగాపురం వరకూ బీచ్ రోడ్డును విస్తరించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. సిటీపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించడం.. పర్యాటక అభివృద్ధికి కొత్త బాటలు వేయడమే లక్ష్యంగా మెరైన్ డ్రైవ్ రహదారి నిర్మాణం పరిశీలనలో వుంది.

 

స్టీల్ సిటీ విశాఖలో కార్యనిర్వహక రాజధాని ఏర్పడుతున్న తరుణంలో మౌలిక వసతులు పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం మాటెలా ఉన్నా భవిష్యత్ అవసరాల దృష్ట్యా  రహదారుల నిర్మాణం, విస్తరణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటికే నగరంలో రెండు ప్రధానమైన రహదారులు ఉన్నాయి. వీటిలో ఒకటి సిటీ మధ్య నుంచి సాగే జాతీయ రహదారి అయితే... రెండోది బీచ్ రోడ్. అధికశాతం ట్రాఫిక్ నేషనల్ హైవే మీదనే ఆధారపడాల్సి వస్తోంది. నగరంపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు అనకాపల్లి నుంచి ఆనందపురం వరకూ ఆరు లైన్ల రహదారి నిర్మాణం జరుగుతోంది. NH16ను మళ్ళించడం ద్వారా చెన్నై-కోల్ కతా మార్గంలో రాకపోకలు సాగించే రవాణా వాహనాలు సిటీలోకి రావాల్సిన అవసరం వుండదు. నగరంపై ఒత్తిడిపడకుండా కనెక్టివిటీ పెరగాలంటే రహదారుల విస్తరణ జరగాల్సి ఉంది. కొన్ని నూతన ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. వీటిలో బీచ్ రోడ్డు విస్తరణ ఒకటి. 


 
విశాఖపట్నం-భీమిలి మధ్య వున్న బీచ్ రోడ్డు పొడవు సుమారు 30కిలోమీటర్లు. గత ప్రభుత్వం 4లైన్ల రహదారిగా విస్తరించింది. ఇప్పుడు ప్రతిపాదిత రాజధాని ప్రాంతానికి చేరుకోవడానికి ఈ మార్గం కీలకం. త్వరలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ప్రారంభం కానున్నాయి. ఎయిర్ పోర్ట్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోకి వచ్చే అవకాశాలు అధికం. దీంతో భీమిలి వరకూ వున్న బీచ్ రోడ్డును భోగాపురం వరకూ విస్తరించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ రహదారి అందుబాటులోకి వస్తే నగరం మీద ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడమే కాదు... ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే ప్రయాణీకులకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వున్న బ్యూటిఫుల్ బీచ్ రోడ్డులను ప్రామాణికంగా తీసుకుని అభివృద్ధి చేస్తే పర్యాటకం పెరుగుతుందనే అభిప్రాయం వుంది. 

 

ప్రస్తుతం విశాఖ జనాభా సుమారు 23లక్షలు. ఎగ్జిక్యూటివ్ రాజధాని పూర్తిస్ధాయిలో ఏర్పాటైతే జనాభా ఒక్కసారిగా పెరిగే అవకాశం వుంది. దీంతో పాటు వాహనాల రద్దీ మరింత పెరుగుతుంది. సిటీలో ఉన్న రహదారులు భవిష్యత్తు అవసరాలకు ఏమాత్రం సరిపోవు. పైగా నగరం నుంచి రాజధానికి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే ట్రాఫిక్ ఒత్తిడి పెరుగుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే బీచ్ రోడ్డుని విస్తరించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అదే జరిగితే పర్యాటక పరంగానూ సుమారు 60కిలోమీటర్ల మెరైన్ డ్రైవ్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.

 

మనదేశంలో పశ్చిమ తీరంలో సుదీర్ఘ మెరైన్ డ్రైవ్ అందుబాటులో వుంది. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నిర్మాణంలో భాగంగా విశాఖ బీచ్ రోడ్డు విస్తరణను ప్రభుత్వం చేపడితే.. అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు వెలుగులోకి వచ్చేందుకు దోహదపడుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: