బైక్‌పై దర్జాగా తిరగడం.. పోలీసులు కనిపించినా హాయ్‌ అంటూ సరదాగా పలకరించడం.. ఇదీ ఆ గ్యాంగ్‌ స్టయిల్‌. అసలు పనేంటంటే.. పగలు రెక్కీలు చేయడం... రాత్రుళ్లు చోరీలు చేయడం.  ఎవరికీ డౌట్‌ రాదనుకున్నారు.. కానీ నిజం నిప్పులాంటిది కదా.. అందుకే బయటపడిపోయింది.. అందుకే పెప్పర్‌ స్ర్పే రూపంలో ఈ గ్యాంగ్‌ బాగోతం బట్టబయలైపోయింది.

 

ఒకటి కాదు రెండు కాదు...ఏకంగా 27 చోరీలు. ఒక్క క్లూ కూడా పోలీసులకు దొరక్కుండా చోరీలు చేయడంలో ఆరితేరారు. తమిళనాడుకు చెందిన వర్దన్‌ మణికందన్‌ అలియాస్‌ గణేశ్‌... హైదరాబాద్‌  మాదన్నపేటలో నివాసముంటున్నాడు. చౌటుప్పల్‌ లింగోజిగూడకు చెందిన పిల్ల యాదయ్య , నలగొండ జిల్లా మునగోడు మండలం కొంపల్లి గ్రామానికి చెందిన షేక్‌ సయ్యద్‌ అలియాస్‌ సలీమ్‌,  యాదాద్రి జిల్లా ఏదుల్లగూడానికి  చెందిన ములుపోజు ఉపేంద్రాచారి, దూల్‌పేటకు చెందిన ఆరక్ల లక్ష్మీనారాయణలతో కలిసి ఓ గ్యాంగ్‌ ఏర్పాటు చేశాడు. మణికందన్‌ స్కెచ్‌లను మిగితా వాళ్లు ఫాలో  అవుతారు. తాళం వేసి ఉన్న ఇళ్ల కోసం డే టైమ్‌లో రెక్కీ చేయడం.. రాత్రుల్లో దోపిడీలు చేయడం వీరి పని. రాచకొండ కమిషనరేట్‌ పరిదిలో యధేచ్చగా చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠాను  పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. 

 

చోరీ చేసేందుకు వెళ్లేప్పుడు ఎయిర్‌ పిస్టల్‌, పెప్పర్‌ స్ప్రే, కత్తులు వెంట తీసుకెళ్లడం ఈ గ్యాంగ్‌కు అలవాటు. చోరీ సాఫీగా సాగిపోతే సరి.. వీటిని ఉపయోగించైనా దోపిడీని సక్సెస్‌గా పూర్తి చేస్తారు. ఇప్పటివరకూ అంతా సాఫీగానే జరిగింది. లక్షల సొమ్మును కాజేశారు. దీంతో ఈ తరహా చోరీలనే ప్రొఫెషన్‌గా మార్చుకున్న ఈ గ్యాంగ్.. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 27 చోరీలు చేశారు.

 

అయితే ఇన్నాళ్లూ తప్పించుకుని తిరుగుతున్న ఈ గ్యాంగ్‌ను.. వాళ్లు వాడే పెప్పర్‌ స్ప్రేనే పోలీసులకు పట్టించింది. మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిదిలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుల్స్‌..  బైక్‌ మీద వస్తున్న మణికందన్‌ , అరక్ల లక్ష్మినారాయణలను ఆపారు. షరా మామూలుగానే హలో ఫ్రెండ్‌.. అంటూ తనను తాను టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌గా పరిచయం చేసుకున్నాడు మణికందన్‌ .  వారి ప్రవర్తన చూసి అనుమానం వచ్చిన కానిస్టేబుల్స్‌.. ఐడీ కార్డు చూపమన్నారు. దీంతో దొంగలు నీళ్లు నమలడం మొదలెట్టారు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. బైక్‌  వెనకాల కూర్చున్న గ్యాంగ్‌లీడర్‌ మణికందన్‌.. తన జేబులోని పెప్పర్‌స్ప్రే తీసి కానిస్టేబుళ్ల కళ్లల్లో కొట్టి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే ఓ కానిస్టేబుల్‌ వారిని వెంబడించాడు. మణికందన్‌  తప్పించుకోగా.. లక్ష్మినారాయణ దొరికిపోయాడు. 27 చోరీల చిట్టా విప్పేశాడు. 

 

ఈ గ్యాంగ్.. గుప్తనిధుల కోసం పలుచోట్ల తవ్వకాలు జరిపినట్టు కూడా పోలీసుల విచారణలో తేలింది. దీంతో నిందితుల క్రిమినల్‌ హిస్టరీపై పోలీసులు దృష్టి పెట్టారు. 22 లక్షల విలువైన బంగారు  ఆభరణాలను స్వాదీనం చేసుకున్న పోలీసులు... ఈ 27 కేసులేనా.. ఇంకా ఎక్కడైనా చోరీలకు పాల్పడ్డారా అనేది కూపీ లాగుతున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: