వరంగల్‌ జిల్లా మార్కెట్‌లో పత్తి  రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు దళారులు. మార్కెట్‌లోకి పంట వచ్చింది మొదలు ప్రతి చోటా రైతన్న కష్టాన్ని దోచుకుంటున్నారు.  అన్నదాతకు సహకరించాల్సిన అధికారులు దళారులతో చేతులు కలిపారు. వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌లో అడగడుగునా రైతన్న మోసపోతున్న తీరు ఆవేదన కలిగిస్తోంది. 

 

ఆరుగాలం శ్రమించి.. చెమటోడ్చి రైతన్న పండించిన పంటను వరంగల్‌ జిల్లా మార్కెట్‌లో దళారులు అప్పనంగా మింగేస్తున్నారు. రైతులకు రావాల్సిన లాభాలను కొట్టేస్తున్నారు దళారులు. మార్కెట్‌లోని నిబంధనలను, లొసుగులను ఆసరా చేసుకుని కాసులు దండుకుంటున్నారు. 

 

మార్కెట్ లోని వ్యాపారులు, అధికారులు ధరను నిర్ణయిస్తారు. నిర్ణయించిన ప్రకారం రైతులు తీసుకొచ్చిన వ్యవసాయ ఉత్పత్తులకు ఆ వ్యాపారుల ద్వారా నేరుగా వ్యాపారుల ధర నిర్ణయించి కొనుగోలు చేస్తారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో దళారులు కొత్త దందాకు తెరతీశారు. రైతుల నుంచి తక్కువ ధరకు పత్తి కొని, వారి పేరు మీద సీసీఐ కేంద్రంలో ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. కాంటా లెక్కల్లో తేడాలు చూపించి రైతుకు మద్దతు ధర అందకుండా చేస్తున్నారు దళారులు.

 

నిజమైన మద్దతు ధరను పత్తి రైతులకు అందకుండా చేస్తున్నారు దళారులు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. మార్కెట్‌ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. తూకంలో మాయ చేసి రైతుల జేబులకు చిల్లు కొడుతున్నారు. పత్తిని రీసైక్లింగ్‌ చేసి సీసీఐకి అమ్మి రోజుకు లక్షల్లో మార్కెట్‌ ఆదాయానికి గండి కొడుతున్నారు. వీటన్నింటిని నియంత్రించాల్సిన మార్కెట్‌ కమిటీ అధికారులు మాముళ్ల మత్తులో పడ్డారు.

 

మార్కెట్ పరిధిలో ఆగే రైతుల పత్తి లోడ్ వాహనాల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు దళారులు. ఆ పత్తిని వేరే వాహనాల్లోకి మార్చి , అదే రైతుల  పేరుతో సీసీఐకి అమ్ముతున్నారు. దీంతో రైతులకు భారీగా నష్టం వాటిల్లితోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మార్కెట్‌లోని దారుణాలను ఆపాలని కోరుతున్నారు రైతన్నలు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: