ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు మృగాళ్లు రెచ్చిపోతున్నారు. మాటువేసి మరీ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా, ఎంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నా.. దారుణాలు ఆగడం లేదు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

 

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో దారుణం జరిగింది. రాత్రి వేళ మెడికల్ షాపుకి వెళ్లొస్తున్న ఓ మహిళపై.. రౌడీ షీటర్ గ్యాంగ్  సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృగాళ్ల వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో, కామాంధుల వికృత క్రీడ బయటపడింది. 

 

ముఖ పరిచయం ఉన్న వ్యక్తి కావడం, పిల్లలకి ఒంట్లో బాగోలేదన్న ఆందోళనలో బాధిత మహిళ యూకూబ్ అనే వ్యక్తి బైక్ ఎక్కింది. ఇంటికి వెళ్లే మార్గంలో దారిమళ్ళించిన కన్నింగ్ ఆమెపై బలవంతంగా అత్యాచారం జరిపాడు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న మరికొంతమంది మృగాళ్లు... ఆమెకు బలవంతంగా మద్యం పట్టించి, తీవ్రంగా గాయపర్చి సామూహిక అత్యాచారం జరిపారు. మరో రెండు వారాలు గడిచే సరికి అదే గ్యాంగ్ నుంచి వేధింపులు ఎక్కువకావడంతో, బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.

 

అత్యాచార బాధితురాలిని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మహిళలపై దాడులను అరికట్టేందుకే ప్రభుత్వం దిశ చట్టం  తీసుకొచ్చిందన్నారు. ఘటనపై త్వరితగతిన విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చూస్తామన్నారు. దిశ చట్టం ద్వారా నిందితులకు కఠిన శిక్ష విధించాలని బాధితురాలి బంధువులు కోరుతున్నారు. ఓవైపు నిర్భయ నిందితులకు ఉరిశిక్ష పడుతుందని తెలిసినా... దిశ అత్యాచార కేసులో నిందితుల ఎన్ కౌంటర్ జరిగినా.. కామాంధులకు ఏమాత్రం బెదరడం లేదు. ఒంటరిగా మహిళ దొరికితే చాలు అఘాయిత్యానికి ఒడిగడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: