అమాయకులే వారి టార్గెట్. లాటరీలు, గిఫ్ట్‌లంటూ గిల్లుతారు. అందినకాడికి దోచేసి, ఆ తర్వాత పంగనామం పెడతారు. ఫేస్ బుక్‌లో నకిలీ ప్రొఫైల్స్‌తో వల విసురుతున్నారు సైబర్ నేరగాళ్లు. భారీ బహుమతులంటూ ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు అత్యాశతో  సైబర్ క్రిమినల్స్ ట్రాప్‌లో పడి... పెద్ద మొత్తంలో పోగొట్టుకుంటున్నారు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

 

ఫేస్ బుక్‌లో సైబర్ మోసాలు ఎక్కువైపోయాయి. నేరగాళ్లు మారు పేర్లతో పంపే ఫ్రెండ్ రిక్వెస్ట్ లను యాక్సెప్ట్ చేస్తూ నిలువునా మోసపోతున్నారు అమాయకులు. విదేశాల్లో తమకు కోట్లాది రూపాయల ఆస్తి వచ్చిందని.. విలువైన వజ్రా భరణాలు, ఫారిన్ కరెన్సీ పంపుతామని నమ్మబలుకుతారు మోసగాళ్లు. అలా వారి మాటలు నమ్మారో నిలువునా మునగడం ఖాయమంటున్నారు పోలీసులు. కస్టమ్స్ , జీఎస్టీ , ఫారిన్ ఎక్చేంజ్ ట్యాక్స్ ఇలా రకరకాల ట్యాక్సుల పేర్లు చెప్పి అందినకాడికి తమ ఖాతాల్లో డబ్బు జమ చేయించుకుని మోసగిస్తారు సైబర్ నేరగాళ్లు. అత్యాశకు పోతే అసలుకే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు. 

 

అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, జర్మనీ వంటి దేశాల్లో పనిచేస్తున్నామని.. కేటుగాళ్లు బిల్డప్ ఇస్తారు. అసలైన ఖాతాదారుడి ప్రొఫెషన్ తెలుసుకుని ఆ వ్యక్తి ఫొటోతో ఖాతా తెరిచి.. మోసాలకు పాల్పడుతున్నారు. సికింద్రాబాద్ కు చెందిన ఓ మహిళతో ఫేస్ బుక్ లో పరిచయం పెంచుకుని 15 లక్షలు కాజేశారు సైబర్ క్రిమినల్స్. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ వద్ద 18 లక్షల రూపాయలు తమ అకౌంట్లలో జమ చేయించుకున్నారు నేరగాళ్లు. కుమార్తె పెళ్లికి రుణం వస్తుందేమోనన్న ఆశపడ్డ మహిళ నుంచి 6 లక్షలు కాజేశారు. లాటరీలు, గిఫ్టులు, ఆన్ లైన్ రుణాలు పేరిట మోసాలకు పాల్పడే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.  డబ్బుపోయాక బాధపడేకన్నా.. ముందే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని సూచిస్తున్నారు పోలీసులు. ఇలాంటి రిక్వెస్ట్ లపై అప్రమత్తంగా ఉండాలంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: