ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ పంచ్ డైలాగులతో విరుచుకుపడే సినీ నటుడు, సీఎం జగన్ కు సన్నిహిత వ్యక్తిగా పేరుపడ్డ పోసాని కృష్ణ మురళీ ఎస్వీబీసీ చైర్మన్ నటుడు పృథ్వి మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ తరఫున ఏదైనా విషయంపై మాట్లాడాలంటే సామాజిక స్పృహ ఉన్న వాళ్లను కూర్చోబెట్టాలి కానీ జగన్ విలువ పోగొట్టే వాళ్లకు పదవులు ఇచ్చి వాళ్ళతో మాట్లాడించడం వల్ల జగన్ పరువు పోతుందని పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో ఆడపడుచులను కించపరిచేలా పృథ్వి మాట్లాడటం సరికాదని ఆయన మండిపడ్డారు.


 ప్రజల జీవితాలు బాగుపడతాయని భావించి ఏడాదికి మూడు పంటలు పండే భూములను త్యాగం చేసిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటారా ? అంటూ మండిపడ్డారు. రైతులు ప్యాంటు షర్టు వేసుకోకూడదా ? రైతు ఆడపడుచులు ఖరీదైన బట్టలు వేసుకోకూడదా ?  పంటలు పండే భూములు ప్రభుత్వానికి ఇచ్చిన మహిళలు రెండు బంగారు గాజులు వేసుకోకూడదా ? వాళ్ళు చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని మాట్లాడకూడదా ? ఇలాంటి మాటలు అన్నందుకు నువ్వు సిగ్గుపడాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు మహిళలను అవమానించేలా మాట్లాడిన నువ్వు రేపు ప్రెస్ మీట్ పెట్టి అందరికీ క్షమాపణ చెప్పాలంటూ పోసాని డిమాండ్ చేశారు. నీలాంటి వ్యక్తులు వల్లే ఇప్పుడు అందరూ జగన్ ను తిడుతున్నారని పోసాని ఫైర్ అయ్యారు.


 ప్రతిపక్షంలో ఉండగా జగన్ ఏడాదిన్నర పాటు పాదయాత్ర చేస్తూ జనంలో తిరిగారని, అయినా ఎప్పుడూ ఎవరి గురించి చులకనగా మాట్లాడలేదని, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ కులం పేరు ఎత్తకుండా జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నారని, అటువంటి జగన్ ప్రభుత్వం పేరును నాశనం చేసేందుకు మీలాంటి వాళ్ళు పుట్టారు. సిగ్గుపడాలి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

 

అందరిని సీఎం జగన్ సమానంగా చూస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం భ్రష్టు పట్టిస్తున్నారని పోసాని విమర్శలు చేశారు. రైతులను మహిళలను కించపరిచేలా పృథ్వి మాట్లాడదాం తగదని, వెంటనే క్షమాపణ చెప్పకపోతే తాను మరింతగా ఆయనపై విమర్శలు చేస్తానని పోసాని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: