భారత్‌ భవిష్యత్‌ పాలిట క్రూడ్‌ కీలకంగా మారింది. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలతో భారత్‌ సహా ప్రపంచ మార్కెట్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడుతున్నాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు అందరినీ భయపెడుతున్న అంశం.

 

ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులతో పశ్చిమాసియా నుంచి క్రూడాయిల్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. అమెరికాపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్‌.. హార్మూజ్‌ జలసంధి నుంచి చమురు ఎగుమతులను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించవచ్చన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. 2018లో ఈ జలమార్గం గుండా రోజుకు 2.1 కోట్ల పీపాల చమురు సరఫరా జరిగింది. యుద్ధ భయాలతో చమురు ధర ఇప్పటికే 70 డాలర్లకు చేరువైంది. హార్మూజ్‌ జలసంధి నుంచి ఎగుమతులకు ఆటంకమేర్పడితే రేట్లు అనూహ్యంగా పెరిగే ప్రమాదం ఉంది. అదే గనుక జరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. 

 

దేశీయ ఇంధన అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే సమకూరుతున్నాయి. ఇప్పటికే ఇంధన దిగుమతుల బిల్లు తడిసిమోపెడవుతోంది. పైగా ఆర్థిక మందగమనంలోకి జారుకున్నాం. ఈ తరుణంలో క్రూడ్‌ ధర అనూహ్యంగా పెరగడమంటే మూలిగే నక్కపై తాటి పండు పడినట్లేనని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. క్రూడ్ తో పాటు బంగారం ధరలు కూడా అనూహ్యంగా పెరగొచ్చని చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లతో పాటు ఉత్పత్తులు కూడా రేట్లు పెరుగుతాయి. దిగుమతుల బిల్లు పెరిగితే.. ద్రవ్యలోటు, కరెంట్ ఖాతాపై ఆ ప్రభావం పడుతుంది. 

 

హార్మూజ్‌ జలసంధి ద్వారా ముడిచమురు ఎగుమతులు నిలిచిపోయిన పక్షంలో..  బ్యారెల్‌ ధర 100 డాలర్లకు ఎగబాకినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదన వినిపిస్తోంది. దీర్ఘకాలంపాటు ముడి చమురు ధరలు గరిష్ఠ స్థాయిలోనే కొనసాగితే కార్పొరేట్‌ కంపెనీల ఆదాయాలు, లాభాలపైనా ప్రభావం చూపనుంది. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తత కారణంగా ముడి చమురు ధరలు ఎగబాకుతున్న తరుణంలో.. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్‌కు ఎలాంటి సంక్షోభ ముప్పు లేదని, ఈ పరిణామానికి సంబంధించి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: