కేంద్ర ప్రభుత్వం జాతీయ జనాభా పట్టిక రూపకల్పనకు సిద్దమైన సంగతి మనకు తెలిసిందే. ఎన్‌ఆర్‌సీ, సీఏఏలకు ఎన్‌పీఆర్ అనేది దొడ్డిదారి అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ విమర్శలను పట్టించుకోవడం లేదు. పౌరసత్వ గుర్తింపు కార్డులు ఇవ్వడమే ఎన్‌పీఆర్ లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా జనాభా లెక్కలకు సంబంధించి ఓ ప్రకటనను హోం మంత్రిత్వ శాఖ రిజిస్ట్రార్ జనరల్ విడుదల చేసింది. అయితే.. ఈ ఏడాది ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య కాలంలో జనాభా లెక్కలను సేకరించనున్నారు. 


జనాభా లెక్కల కోసం సేకరించే అంశాల్లో ఇంట్లో ధాన్యం వినియోగానికి సంబంధించిన వివరాలను కూడా సేకరించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. వీటితో పాటు గృహ వినియోగానికి సంబంధించిన పలు వివరాలు కూడా సేకరించనున్నట్టు తెలిపింది. జనాభా లెక్కల సేకరణ- 2021లో సేకరించే వివరాల్లో భాగంగా స్మార్ట్ ఫోన్, గ్యాస్ పైప్‌ లైన్ కనెక్షన్స్, మొబైల్ నంబర్ వంటి వివరాలను కూడా సేకరించనున్నారు. జనాభా లెక్కల్లో ఈ రకమైన వివరాలను సేకరించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 


జనాభా లెక్కలకు సంబంధించిన కమ్యూనికేషన్ వివరాల కోసం మాత్రమే సెల్ ఫోన్ నంబర్ అడుగుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈసారి జనాభా లెక్కల వివరాల్లో బ్యాంకింగ్‌ కి సంబంధించిన ప్రశ్నలను కూడా తొలగించడం గమనార్హం. విడుదల నోటిఫికేషన్ ప్రకారం జనాభా లెక్కల కోసం మొత్తం 31 అంశాలకు సంబంధించిన వివరాలను పౌరుల నుంచి సేకరించనున్నారు. గతంలో జరిగిన జనాభా లెక్కల సేకరణలో 30 ప్రశ్నలు మాత్రమే అడగ్గా.. అందులో ధాన్య వినియోగానికి సంబంధించిన ప్రశ్న లేదు. ఇక ఎన్‌పీఆర్ అప్‌డేట్ కోసం 21 అంశాలకు సంబంధించిన వివరాలను సేకరించనున్నానరు.


జనాభా లెక్కలను సేకరించే సమయంలో ఎన్‌పీఆర్ కూడా అప్‌డేట్ చేయనున్నారు. దేశంలో అసలు ఎంత మంది నివసిస్తున్నారన్న లెక్క తేల్చడమే ఎన్‌పీఆర్ ఉద్దేశం. ఏదైనా ఒక ప్రాంతంలో ఆర్నెళ్ల నుంచి నివసిస్తున్నవారిని, లేదా రాబోయే ఆర్నెళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఏదైనా ప్రాంతంలో ఉండాలని నిర్ణయించుకున్న వారిని స్థానిక పౌరులుగా గుర్తించి ఇంటి ఇంటికి ఆ వివరాలను నమోదు చేస్తారు. మన దేశంలో గత 6 నెలలుగా నివసిస్తున్న విదేశీయుల వివరాలను కూడా ఇందులో నమోదు చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: