చాలా కాలంగా స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్... జనంలోకి వెళ్లాలనే ఆలోచలో పడింది. కార్యాచరణ మాత్రం కొత్త పీసీసీ చీఫ్ వచ్చిన తరువాతే అమలు చేయాలనే ఆలోచనలో ఉంది. ఇప్పుడున్న పరిస్ధితిలో పార్టీ నిర్మాణం ఒక వైపు.. జనంలోకి వెళ్లటం మరొకటి.. రెండింటిని సమపాళ్లలో నడిపించాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. 

 

తెలంగాణలో పీసీసీ మార్పు అనేది ఫిబ్రవరి 15కు వాయిదా పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయంటే.... తెలంగాణ తో పాటు... పార్టీ నిర్మాణం, నాయకత్వ మార్పులపై ఎఐసీసీ దృష్టి సారించబోతుందని తెలుస్తోంది. పీసీసీ చీఫ్  రేసులో ఉన్న వారిలో ప్రధానంగా...శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డిలున్నారు. రెడ్డియేతర సామాజిక వర్గానికి చోటు కల్పించాలనే ఆలోచనలో ఎఐసీసీ ఉందని టాక్. ఇదే జరిగితే... వర్కింగ్ ప్రసిడెంట్ ను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే అవకాశం ఇవ్వాలని పరిశీలిస్తున్నట్టు సమాచారం. వర్కింగ్ ప్రసిడెంట్లు నలుగురిని మళ్లీ కంటిన్యూ చేసే ఆలోచన లేనట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ తో పాటు గా ఒక వర్కింగ్ ప్రసిడెంట్ ని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీసీసీ రేసులో ఉన్న కోమటిరెడ్డికి గనక చీఫ్ ఇవ్వలేకపోతే వర్కింగ్ ప్రసిడెంట్ పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయని తెలస్తోంది. లేదంటే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు కూడా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ పదవికి పరిశీలనలో ఉంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ ఇవ్వకుంటే...వర్కింగ్ తీసుకోవటానికి సిద్దంగా ఉన్నారా..? అనేది అసలు ప్రశ్న. ఎట్టి పరిస్ధితిలో పీసీసీ కావాల్సిందే అనే రీతిలోనే ప్రయత్నాలు చేస్తున్నారు కోమటిరెడ్డి.

 

ఏఐసీసీలో కూడా ప్రక్షాళన ఉంటుంది కాబట్టి.. తెలంగాణకు మూడు నుంచి నాలుగు ఎఐసీసీ కార్యదర్శుల పదవులు వచ్చే అవకాశం ఉంది. ప్రధాన కార్యదర్శి తో పాటు... అధికార ప్రతినిధుల భర్తీ కూడా త్వరలోనే ముగుస్తోంది. వీటన్నింటి పై క్లారిటీ రాగానే... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ పెంచాలనే ఆలోచనతో ఉంది. ప్రజల సమస్యలన్నింటినీ పరిగణలోకి తీసుకుని .జనంలోకి వెళ్లాటానికి పాదయాత్రను ఎంచుకునే ఆలోచన చేస్తుంది. సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ను ముందుంచి పాదయాత్ర చేసే అవకాశం ఉంది. సీఎల్పీ నాయకుడి హోదాలో రాష్ట్ర మంతా పర్యటించటానికి వీలుగా ఎఐసీసీ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ పదవుల భర్తీ తరువాత పాదయాత్రకు సిద్ధమౌతోంది కాంగ్రెస్.  

మరింత సమాచారం తెలుసుకోండి: