కర్నూలు జిల్లాలో వంట గ్యాస్ డీలర్లు ఎడాపెడా దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే అధికంగా వసూలు చేస్తూ వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. రెవెన్యూ అధికారుల దృష్టికి ఈ వ్యవహారం వెళ్లినా చూసిచూడనట్టు నటిస్తున్నారు. మరోవైపు గ్యాస్ కంపెనీల్లో విజిలెన్స్ విభాగం ఉన్నా,  కస్టమర్ల ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

 

కర్నూలు జిల్లాలో వంట గ్యాస్ డీలర్ల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. నిబంధనలకు విరుద్ధంగా అదనంగా 40 నుంచి వంద రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం గ్యాస్ సిలిండర్ పై గోడౌన్ నుంచి 5 కి.మీ దూరం వరకు అదనంగా ఒక్క రూపాయి కూడా వసూలు చేయరాదు. 5 కి.మీ దూరం నుంచి 15 కి.మీ దూరం వరకు 20 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. 15 కి.మీ దూరం నుంచి ఎంత దూరం ఉన్నా 30 రూపాయలు వసూలు చేయాలి. 


  
జిల్లాలో మాత్రం ప్రతి గ్యాస్ డీలర్ సిలిండర్ పై తక్కువలో అతి తక్కువ అంటే 40 రూపాయల నుంచి వంద రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. 5 కి.మీ లోపు దూరం ఉన్నా సరే 40 రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. వాస్తవంగా ఒక్కో సిలిండర్ పై డీలర్ కు 47 రూపాయలు కమిషన్ వస్తుంది. అందులోనే ట్రాన్స్ పోర్టు ఖర్చు కూడా ఉంటుంది. డీలర్లు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నా,  రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.

 

జిల్లాలో 65 గ్యాస్ ఏజెన్సీలు, 11 లక్షల 41వేల  గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెలా దాదాపు 6 లక్షల 80 వేల సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు. ప్రతి సిలిండర్ పైనా సరాసరి 50 రూపాయలు అదనంగా వసూలు చేసినా సుమారు నెలకు 3 కోట్ల 40 లక్షల రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నారు. ఏడాదికి కనీసం 40 కోట్ల రూపాయలు ప్రజల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కర్నూలు జిల్లా ఒక్కసారి విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కేసు నమోదు చేయడం మినహాయిస్తే కన్నెత్తి చూడలేదు. గ్యాస్ డీలర్ల పై గ్యాస్ కంపెనీల అజమాయిషీ కరువైంది. 

 

గ్యాస్ సిలిండర్ పై అదనపు వసూళ్లను ప్రశ్నించిన వారికి గ్యాస్ డీలర్లు, డెలివరీ బాయ్స్ చుక్కలు చూపిస్తున్నారు. ఇంట్లో ఉన్నా డోర్ లాక్ అని రాసేసి డెలివరీ ఇవ్వకుండా వేధిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. రెండోసారి బుక్ చేసినప్పుడు గాస్ సిలిండర్ సకాలంలో డెలివరీ చేయడం లేదంటున్నారు వినియోగదారులు. కర్నూలు జిల్లాలో విస్తృతంగా రెవెన్యూ యంత్రాంగం ఉన్నా.. గ్యాస్ సిలిండర్ల పంపిణీ, వసూళ్లపై దృష్టిపెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: