గ్రాండ్ కానియన్ ను  తలపించే అందమైన లోయలు... చరిత్ర సంస్కృతిని తెలియచేసే కట్టడాలు....  ఒక్క మాట‌లో చెప్పాలంటే తెలుగువారి శౌర్య ప్రతాపాలకు సాక్ష్యంగా నిలిచింది ఈ గండికోట. విజయనగర సామ్రాజ్య కీర్తిని చాటి చెప్పే ప్రదేశాల్లో గండికోట ఒకటి. కడప జిల్లాలోని పెన్నాతీరం ఆనుకుని నిర్మించిన ఈ కోటను చూస్తుంటేనే మరుపురాని అనుభూతులు కలుగుతాయి.  

 

విజయనగర సామ్రాజ్యపు సామంతుల పాలనలో గండికోట సీమకు రాజధానిగా వెలిసింది. ఈ  గండికోటలో స‌హ‌జ సిద్ధంగా ఏర్పడి  వంపులు వంపులుగా  ప్రవహించే పెన్నానది ఆ ప్రాంతానికి మరింత ప్రత్యేకతను తెచ్చి పెడుతోంది. వెయ్యి అడుగుల వెడల్పు,  ఐదు వందల అడుగుల లోతులో సహజంగా ఏర్పడిన కందకం  ఉండ‌టం చేత‌నే ఈ ప్రదేశానికి గండికోట అనే పేరు వచ్చింది. చాలామంది రాజులు, రాజ్యాలు పోయినా ఇప్పటికీ ఇది భారతీయుల గ్రాండ్ కానియన్ గా  పిల‌బ‌డుతోంది. ప‌ర్యాట‌కుల‌కు ముచ్చటగొలుపుతోంది.  

 

గండికోట పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది నాటి రాజుల పౌరుషాలు, యుద్దాలే.  అప్పటి రాజరిక ఛాయలు కళ్లముందు కదలాడతాయి. వాటన్నింటికీ సంబంధించి అప్పటి శిల్పుల నైపుణ్యం  నేటికీ చెక్కు చెదరలేదు. ఎటుచూసినా అబ్బురపరిచే దృశ్యాలు కనిపిస్తాయి. ప్రకృతి అందాలతో గండికోట సందర్శకులను ఆహ్లాద పరుస్తుంది. పెన్నా- చిత్రావతి నదులుకలిసే చోట కొండల మధ్య సహజసిద్ధంగా ఏర్పడి గండికి సమీపంలోని పర్వతంపై నిర్మించినందున గండికోటగా పేరు వచ్చిందని చెబుతారు.

 

గండికోట పరిసర ప్రాంతాల్లో 21 దేవాలయాలు నిర్మించారు.  తెలుగు సినీ ప్రేక్షకులకైతే గండికోట సుపరిచితమే. ఎందుకంటే ఆ పేరు ఇతివృత్తంతో ఎన్నో తెలుగు సినిమాలు తెరకెక్కాయి. కళ్యాణి చాళుక్యుల నిర్మాణ శైలికి ప్రతీకగా నిలిచే ఈ కోట ఎన్నో చారిత్రాత్మక విశేషాలను త‌న‌లో దాచుకుంది. 

 

గండికోట చరిత్రను చాటి చెప్పడం పర్యాటకంగా ఉపయుక్తంగా మలుచుకోవడం కోసం... వారసత్వ ఉత్సవాల నిర్వహణను తలపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈనెల 11, 12తేదీల్లో ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ఉత్సవాల ఉత్సాహంతో నైనా.. గండికోట దశ మారుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: