ఇరాన్ క్షిపణి దాడులతో కవ్వించినా.. వైట్ హౌస్ ఎందుకు శాంతిమంత్రం పఠిస్తోంది. అధ్యక్షుడి అధికారాలకు కత్తెర వేసేందుకు అమెరికా చట్టసభ సభ్యులు ప్రయత్నిస్తున్నారా? ఇరాన్‌తో అణు ఒప్పందం రద్దు చేసుకోవాలన్న ట్రంప్ ప్రతిపాదనను.. ఈయూ తిరస్కరిస్తోందా? ఇంతకూ ఇరాన్‌ విషయంలో అంతర్జాతీయ సమాజం వైఖరి ఎలా ఉందో తెలుసా?

 

ఇరాన్‌తో యుద్ధానికి కాలు దువ్వుతున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను దారికి తెచ్చే ఉద్దేశంతో అమెరికా చట్టసభ సభ్యులు చర్యలకు దిగారు. ఇరాన్‌పై సైనిక చర్య తీసుకునే విషయంలో ఆయన అధికారాలను పరిమితం చేయాలంటూ ప్రతినిధుల సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కాంగ్రెస్‌ అనుమతి లేకుండా ఇరాన్‌పై సైనిక చర్యకు ఉపక్రమించరాదంటూ.. 1973 నాటి యుద్ధ అధికారాల తీర్మానాన్ని ప్రస్తావిస్తూ అధ్యక్షుడికి స్పష్టంచేసింది. అయితే అమెరికన్లపై దాడి పొంచి ఉంటే ఆత్మరక్షణ కోసం బలగాలను ఉపయోగించేలా మినహాయింపును ఇచ్చింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 224 ఓట్లు, వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి. ట్రంప్‌కు సంబంధించిన రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు ముగ్గురు విపక్ష డెమోక్రాట్లతో చేతులు కలిపారు. 
కాంకరెంట్‌ తీర్మానంగా దీన్ని ప్రవేశపెట్టారు. చట్టానికి సమాన స్థాయి ఉండకపోయినా.. ట్రంప్‌ విదేశీ విధానాన్ని వ్యతిరేకించడానికి ఒక రాజకీయ సాధనంగా విపక్షాలకు ఉపయోగపడుతుంది. యుద్ధాన్ని భరించే పరిస్థితుల్లో అమెరికా కానీ ప్రపంచ దేశాలు కానీ లేవని ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి తెలిపారు. అయితే దాడులు చేపట్టడానికి తనకు ఎవరి ఆశీస్సులు అవసరంలేదని ట్రంప్‌ స్పష్టంచేశారు. సెకన్ల వ్యవధిలోనే కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. 

 

ఇరాన్‌ అగ్రశ్రేణి సైనిక కమాండర్‌ సులేమానీని చంపే ముందు తమను సంప్రదించలేదన్న కాంగ్రెస్‌ సభ్యుల విమర్శలను ఖండించారు ట్రంప్. వారిని సంప్రదించి ఉంటే సదరు ఆపరేషన్‌ వివరాలను లీక్‌ చేసి ఉండేవారని ఆరోపించారు.

 

ఇరాన్‌తో అణు ఒప్పందానికి తిలోదకాలివ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పిలుపునిచ్చినప్పటికీ ఈయూ సభ్య దేశాలు సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. దీనిపై చర్చించేందుకుగాను బ్రసెల్స్‌లో అత్యవసరంగా భేటీ కావాలని ఈయూ దేశాల విదేశాంగ మంత్రులు, నాటో సెక్రటరీ జనరల్‌ నిర్ణయించారు. ఐరోపాలో తరచుగా ఉద్రిక్తతలు తలెత్తుతున్న నేపథ్యంలో అణు ఒప్పందానికి మద్దతు పలకాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధించేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమైంది. ఇరాన్‌తో జౌళి, నిర్మాణ, ఉత్పత్తి, గనుల రంగాల్లో వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకోకుండా నిషేధాజ్ఞలు విధిస్తూ ట్రంప్‌ ఉత్తర్వులు జారీ చేసింది.ఇరాన్ ఆర్థికవ్యవస్థకు కీలకమైన చేనేత, ఉక్కు, ఇనుము తదితర రంగాలకు సంబంధించి విడిగా ఆంక్షలు విధించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: